బీజేపీలో విచిత్రం..మరీ ఇంత అన్యాయమా ?

తెలంగాణా బీజేపీలో ఏమి జరుగుతోందో కూడా ఎవరికీ అర్ధంకావటంలేదు. ఈరోజు నుండి అసెంబ్లీ ఓట్ ఆన్ ఎకౌంట్ సమావేశాలు మొదలవుతున్నాయి.

Update: 2024-02-08 04:35 GMT

తెలంగాణా బీజేపీలో ఏమి జరుగుతోందో కూడా ఎవరికీ అర్ధంకావటంలేదు. ఈరోజు నుండి అసెంబ్లీ ఓట్ ఆన్ ఎకౌంట్ సమావేశాలు మొదలవుతున్నాయి. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కేసీయార్ పార్టీ ఎంఎల్ఏలకు దిశానిర్దేశం చేస్తారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానాలు, వ్యూహ, ప్రతివ్యూహాలను చర్చిస్తారు. అయితే బీజేపీ తరపున ఇవ్వన్నీ చేయటానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ? బీజేపీ తరపున శాసనసభాపక్ష నేతనే ఇప్పటివరకు నియమించలేదు. ఎన్నికలు జరిగి రెండునెలలు దాటిపోయినా ఇంతవరకు బీజెపీ ఎల్పీని నాయకుడిని నియమించుకోలేకపోవటమే విచిత్రంగా ఉంది.

పోయిన అసెంబ్లీలో కూడా బీజేపీ ఇలాగే చేసింది. అప్పట్లో బీజేపీ తరపున గెలిచిందే నలుగురు ఎంఎల్ఏలు అయినా శాసనసభాపక్ష నేతలను ఎంపిక చేసుకోలేకపోయింది. ఫలితంగా బీజేపీ ఎల్పీ నేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలను పూర్తిచేసేసింది. ఇదే విషయమై అప్పట్లో దుబ్బాక ఎంఎల్ఏగా పనిచేసిన రఘునందనరావు ఎన్నిసార్లు పార్టీ పెద్దలను కలిసినా ఉపయోగం లేకపోయింది. ఇదే విషయాన్ని రఘు మీడియా ముందు చెప్పినా ఎందుకనో బీజేపీ పెద్దలు పట్టించుకోలేదు.

ఈ నేపధ్యంలోనే రెండునెలల క్రితం ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎనిమిది మంది ఎంఎల్ఏలుగా గెలిచారు. ఇంతమంది గెలిచారు కాబట్టి ఈసారైనా బీజేపీఎల్పీని నియమిస్తారని అనుకుంటే రెండునెలలైనా అతీగతిలేదు. ఇదే విషయాన్ని ఎంఎల్ఏలు పార్టీ పెద్దలకు గుర్తుచేసినా పట్టించుకోవటంలేదు. కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మనసులో ఏముందో తెలీటంలేదు. మూడుసార్లు గెలిచిన కారణంగా తనకే ఆ పదవి దక్కాలని రాజాసింగ్ బలంగా కోరుకుంటున్నారు.

రాజాసింగ్ కు పదవి ఇవ్వటం కిషన్ కు ఇష్టంలేదేమో అనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది. కామారెడ్డిలో కేసీయార్, రేవంత్ రెడ్డిని ఓడించిన తనకే పదవి దక్కాలని వెంకటరమణారెడ్డి కోరుకుంటున్నారు. అలాగే నిర్మల్ లో గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా శాసనసభాపక్ష నేత రేసులో ఉన్నారు. గురువారం నుండి అసెంబ్లీ సెషన్ మొదలవుతుంటే నలుగురు ఎంఎల్ఏలు ఢిల్లీలో కూర్చున్నారట. వాళ్ళు ఎందుకు ఢిల్లీలో కూర్చున్నారో తెలీటంలేదు. బహుశా బీజేపీఎల్పీ పోస్టుపై చర్చించేందుకు వెళ్ళినట్లు అనుకుంటున్నారు. బీజేపీఎల్పీ నేతను కూడా నియమించుకోలేనంత విచిత్రపరిస్ధితులో బీజేపీలో ఉన్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News