ఇదెక్కడి వింత.. ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా!

అయితే ఇందులో ఒకే ఒక్క అభ్యర్థిని ప్రకటించడం విశేషం. ఒకే ఒక్క స్థానానికి అభ్యర్థిని ప్రకటిస్తూ జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది.

Update: 2023-10-27 10:27 GMT

నవంబర్‌ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార బీఆర్‌ఎస్‌ మాత్రమే 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటివరకు ఒక్కో జాబితాను మాత్రమే విడుదల చేశాయి. ఈ రెండు పార్టీల సెకండ్‌ లిస్టు విడుదల కాలేదు.

ఈ నేపథ్యంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో తన రెండో జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో ఒకే ఒక్క అభ్యర్థిని ప్రకటించడం విశేషం. ఒకే ఒక్క స్థానానికి అభ్యర్థిని ప్రకటిస్తూ జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది.

బీజేపీ సెకండ్‌ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క అభ్యర్థి.. మిథున్‌ రెడ్డి. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ ను బీజేపీ అధిష్టానం ఏపీ మిథున్‌ రెడ్డికి కేటాయించించింది.

కాగా అక్టోబర్‌ 22వ తేదీన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 52 మందితో తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్, గజ్వేల్‌ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తారని ప్రకటించింది. అలాగే.. కరీంనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ బరిలోకి దిగనున్నారు. అదేవిధంగా నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కోరుట్ల నుంచి పోటీ చేయనున్నారు.

పాతబస్తీలో అన్ని స్థానాల నుంచి పోటీకి బీజేపీ సిద్ధమైంది. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు ఇలా ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. బీసీలు–16, ఎస్సీలు–8, ఎస్టీలు–6, ఓసీలు–10 మందికి స్థానాలు కేటాయించింది.

తాజాగా బీజేపీ ప్రకటించిన రెండో జాబితాతో ఆ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల సంఖ్య 53కు చేరుకుంది. మిగతా స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుందని తెలుస్తోంది. జనసేన పార్టీ మద్దతు కోసం ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌.. పవన్‌ కళ్యాణ్‌ ను కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరారు.

అయితే పవన్‌ సైతం తన మనసులో మాటను వారితో చెప్పారు. కనీసం 30–35 స్థానాల్లో తెలంగాణలో పోటీ చేయాలని తమ పార్టీ నేతల నుంచి ఒత్తిడి ఉందని వారికి వివరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి కిషన్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు.

అమిత్‌ షా తెలంగాణ పర్యటన సందర్బంగా బీజేపీ–జనసేన పొత్తుపై స్పష్టత వస్తుందని అంటున్నారు. జనసేనకు కేటాయించే సీట్లెన్నో తేలుతుందని చెబుతున్నారు. జనసేనకు కేటాయించగా మిగిలిన సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తుందని పేర్కొంటున్నారు.

Tags:    

Similar News