నాగచైతన్య-సమంత విడాకులకు 'ట్యాపింగే' కారణం: బీజేపీ
వారు ఎందుకలా విడాకులు తీసుకున్నారనే విషయంపై అనేక చర్చలు.. కారణాలు వెలుగు చూసినా.. ఇంకా తెలియని కారణాలు అనేకం ఉన్నాయని టాలీవుడ్ టాక్.
అక్కినేని కుటుంబం రెండోతరం వారసుడు నాగచైతన్య-హీరోయిన్ సమంతలు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ముచ్చట మూణ్ణాళ్లు కూడా మిగల్లేదు. వారు స్వల్ప కాలంలోనే విడాకులు తీసు కున్నారు. వారు ఎందుకలా విడాకులు తీసుకున్నారనే విషయంపై అనేక చర్చలు.. కారణాలు వెలుగు చూసినా.. ఇంకా తెలియని కారణాలు అనేకం ఉన్నాయని టాలీవుడ్ టాక్. వాస్తవానికి ఇది అయిపోయిన ముచ్చట.
ఇప్పుడు ఎవరూ కూడా నాగచైతన్య-సమంత విడాకుల గురించి చర్చించుకునే పరిస్థితి, సమయం, సందర్భం కూడా లేదు. పైగా వారిద్దరూ కూడా ఎవరి కెరీర్‌లో వారు ఉన్నారు. పుష్ప సినిమాకు ముందు జరిగిన ఈ విడాకుల వ్యవహారం.. అప్పట్లో సంచలనం సృష్టించిన మాట వాస్తవమే. కానీ, తర్వాత.. దీనిని మరిచిపోయారు. కానీ, హఠాత్తుగా ఇప్పుడు మరోసారి నాగ చైతన్య(చైతు)-సమంతల విడాకుల వ్యవహారం తెరమీదికి వచ్చింది. అది కూడా.. రాజకీయంగా చర్చకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రస్తుతం తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వీరిచుట్టూ తిరగడం.. సంచలనంగా మారింది. బీజేపీకి చెందిన బూర నర్సయ్య గౌడ్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే.. చైతు-సమంతలు విడాకులు తీసుకున్నారని.. చెప్పారు. నిజానికి ఇప్పటి వరకు ఈ విషయం ఎవరూ ఆరోపించినట్టుగా లేదు. కానీ, బూర మాత్రం సంచలన వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. చైతు-సమంతలకు కూడా చుట్టుకుందని తెలిపారు. వీరు విడిపోవడానికి ట్యాపింగే కారణమన్నారు.
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని.. విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌తోనే శుక్రవారం బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. సమంత-నాగచౌతన్య విడిపోవడానికి ట్యాపింగే కారణమన్నారు. ఫోన్లను ట్యాప్ చేసి.. ఇతరుల బెడ్ రూమ్‌లలోకి తొంగి చూశారని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ మేనల్లుడు.. మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారని మరో సంచలన వ్యాఖ్య చేశారు. అయితే.. బూర వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూడాలి.