వైసీపీలో డౌటానుమానం : బొత్స మనసు పడుతున్నారా ?
అయితే ఆ తరువాత రాజకీయాల గురించి ఆయన ముందే ప్లాన్స్ ఏమైనా వేసుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది.;
వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న వారు బొత్స సత్యనారాయణ. ఆయన వైఎస్సార్ హయాంలో అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఇక రెండవసారి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి అధికారం దక్కిన నాడు ఆయన మూడేళ్ళకు పైగా మంత్రిగా పనిచేశారు. చివరి రెండేళ్ళు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
ఇక జగన్ ప్రభుత్వంలో అయిదేళ్ళ మంత్రిగా చక్రం తిప్పారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చెందినా కూడా బొత్స మాత్రం నెలలు తిరగకుండానే ఎమ్మెల్సీ అయ్యారు. ఆ మీదట కౌన్సిల్ లో లీడర్ ఆఫ్ అపొజిషన్ అయి కేబినెట్ ర్యాంక్ హోదాను అనుభవిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన బొత్సకు ముందు చూపు ఎక్కువ అని అంటారు. ఉత్తరాంధ్రాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన బీసీల నేతగా కూడా గుర్తింపు పొందారు. వైసీపీలో ఆయనకు ప్రాధాన్యత దక్కడానికి ఆ బలమే ఆ ఇమేజ్ నే కారణం అని చెబుతారు.
ఇక బొత్స విషయానికి వస్తే ఆయన భవిష్యత్తు రాజకీయాలను కూడా ఊహించి ముందు జాగ్రత్త పడతారు అని అంటారు. కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ గా చేసిన బొత్స వైసీపీలోకి ఏ మొహమాటం లేకుండా చేరిపోయారు. దానికి ఆయన చెప్పిన కారణం రాజకీయంగా కొనసాగాలన్నదే. దాని కోసం కొన్ని సార్లు మెట్లు దిగాల్సి ఉంటుందని అన్నారు.
ఆయన వైసీపీలో చేరి అనుకున్న పదవులు అందుకున్నారు. తాను అనుకున్న వారికి పదవులు ఇప్పించి విజయనగరం జిల్లాలో చక్రం తిప్పారు. ఇపుడు ఆయన వైసీపీలో బాగానే ఉన్నారా అంటే ఏముంది ఆయనకు కేబినెట్ పదవి దక్కింది కదా అని భావించవచ్చు. అది కూడా 2027 దాకా ఉంది. అలా బొత్స పదవికి మరో రెండున్నరేళ్ళ పాటు తిరుగులేదు.
అయితే ఆ తరువాత రాజకీయాల గురించి ఆయన ముందే ప్లాన్స్ ఏమైనా వేసుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. బొత్స జనసేన మీద మనసు పడుతున్నారు అని చర్చ అయితే ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ తో ఇటీవల కాలంలో బాహాటంగానే మాట్లాడుతూ ఆయనతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. అంతే కాదు మండలిలో కూడా కూటమి మీద పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఆయన ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు.
ఆయన లేటెస్ట్ గా బడ్జెట్ సెషం వేళ ఫోటో షెషన్ లో పవన్ ని కలుసుకుని మాట్లాడడం రాజకీయంగా అనేక చర్చలకు దారి తీస్తోనంది. బొత్స అంతకు ముందు కూడా పవన్ ని హగ్ చేసి అసెంబ్లీ ఆవరణలో అందరికీ ఒక అరుదైన ఫోటోకి ఆస్కారం కల్పించారు. బొత్స సామాజిక వర్గం పరంగా చూసినా లేక మెగా ఫ్యామిలీతో ఉన్న రిలేషన్స్ ని చూసుకున్నా ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
ఉత్తరాంధ్రాలో జనసేన ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. దాని కోసం ఆ పార్టీ కూడా ఎదురుచూస్తోంది. బొత్స వంటి నేత ఉంటే జనసేనకు కొండంత అండగా ఉంటుంది అని అంటున్నారు. బొత్స కూడా జనసేన ఏపీలో బలంగా మారుతోంది అన్న అంచనాకు వస్తున్నారని అంటున్నారు.
వైసీపీలో చూస్తే ఉత్తరాంధ్రా రీజనల్ కో ఆర్డినేటర్ పదవిని ఇవ్వకుండా మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అధినాయకత్వం అప్పగించడం వంటివి బొత్సలో అసంతృప్తిని పెంచాయని అంటున్నారు. ఇక వైసీపీలో అనేక మంది పార్టీలు మారుతున్నారు. పార్టీ అధినాయకత్వం తీరు చూస్తే దిద్దుబాటు చర్యలకు దిగడం లేదు. చాలా విషయాల్లో కూడా సీనియర్లకు ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు.
మరి దాంతో బొత్స కనుక జనసేనలోకి జంప్ చేస్తారా అన్నది కూడా అంతటా చర్చగా ఉంది. బొత్స తానుగా కూటమి నేతలతో సాన్నిహిత్యం నెరపడం వంటివి వైసీపీ అధినాయకత్వం దృష్టిని దాటిపోవని అంటున్నారు. అయినా సరే బొత్స విషయంలో ఏమీ చేయలేని పరిస్థితిలో పార్టీ ఉందని అంటున్నారు. ఒక బొత్స జనసేన ఇమేజ్ తో తన పలుకుబడితో వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో రాజకీయంగా బలపడవచ్చు అన్న ఆలోచనలతో ఉన్నారని అంటున్నారు. దాంతో బొత్స మీద వైసీపీలో డౌటానుమానాలు అంతకంతకు పెరిగిపోతున్నాయట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.