ప్రభుత్వ పెద్దల ఫ్లైట్ జర్నీ ఖర్చు రూ.34.58 కోట్లు... ప్రతిపక్షం ఫైర్!

అవును... కర్ణాటక శాసన మండలిలో ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానంలో భాగంగా స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఉన్నత స్థాయి ప్రముఖుల విమాన ప్రయాణ ఖర్చుల వివరాలు వెల్లడించారు.;

Update: 2025-03-19 17:14 GMT

ఇటీవల కాలంలో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ పెద్దల ఫ్లైట్ జర్నీల ఖర్చు విషయాలపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం వందల కిలోమీటర్లు కార్లలో ప్రయాణించే నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత 25 కి.మీ దూరానికి కూడా హెలీకాప్టర్లను ఉపయోగిస్తూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగపరుస్తున్నారు!

ఈ విషయంలో ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తారతమ్యాలు పెద్దగా లేవని.. ప్రజాధనం అంటే చాలా మంది నేతలకు అత్తగారి సొమ్మేననే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ సమయంలో కర్ణాటక రాష్ట్ర ఖజానాకు రూ.34.58 కోట్లు విమాన ప్రయాణ ఖర్చులు అయ్యాయనే విషయం తెరపైకి వచ్చింది. ఇది సంచలనంగా మారింది.

అవును... కర్ణాటక శాసన మండలిలో ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానంలో భాగంగా స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఉన్నత స్థాయి ప్రముఖుల విమాన ప్రయాణ ఖర్చుల వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... 2023-24లో ప్రముఖుల ఫ్లైట్ జర్నీకి ప్రభుత్వం రూ.13.38 కోట్లు.. 2024-25లో రూ.21.20 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

ఇదే సమయంలో... ఈ ప్రముఖులలో ప్రధానంగా సీఎం సిద్ధరామయ్య అత్యధికంగా ఎక్కువసార్లు హెలీకాప్టర్ ప్రయాణాలు చేసారని.. తర్వాత గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఉన్నారని డేటా వెల్లడించింది. ఈ ప్రముఖులకు జీఎంపీ ఎయిర్ చార్టర్స్ హెలికాప్టర్ సేవలను అందించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్షం మండిపడుతోంది.

ఇందులో భాగంగా... ఢిల్లీకి రానుపోనూ విమాన చార్జీలు రూ.70 వేలకు మించవని.. అలాంటిది ఛార్టర్ ఫ్లైట్ లలో ప్రయాణిస్తూ.. ఒక్కో ట్రిప్పుకు రూ.44.40 లక్షలు ఖర్చు చేస్తున్నారని విమర్శిస్తున్నారు! ఇదే క్రమంలో బెంగళూరు నుంచి మైసూరుకే రూ.10.85 లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారని మండిపడుతున్నారు.

అయితే... ఈ విషయాలపై స్పందించిన ఓ సీనియర్ అధికారి... సీఎం, ఇతర ప్రముఖులు చేపట్టే విమాన ప్రయాణాలన్నీ అధికారిక ప్రయోజనాల కోసమేనని అన్నారు. కొన్ని సందర్భాల్లో సీఎం, గవర్నర్ తో పాటు ప్రత్యేక సందర్భాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర మంత్రులు హెలీకాప్టర్ లను ఉపయోగిస్తారని తెలిపారు.

Tags:    

Similar News