కేసీఆర్ జగన్ .... ఇద్దరూ ఇంతేనా ?
ఈ ఇద్దరూ ఇప్పటికి అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది పెద్దగా లేదు.;
రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక పోలిక స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాల మధ్య సారూప్యం అభివృద్ధి విషయంలో ఎంత ఉందో తెలియదు కానీ ప్రతిపక్ష నేతలుగా ఆ ఇద్దరి నేతల విషయంలో సాపత్యం మాత్రం చాలానే ఉంది అని అంటున్నారు. ఆ ఇద్దరే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వైసీపీ అధినేత వైఎస్ జగన్.
ఈ ఇద్దరూ ఇప్పటికి అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది పెద్దగా లేదు. జగన్ అయితే కేసీఆర్ కంటే బెటర్ గా గత తొమ్మిది నెలలలో ఒక రోజు ఎక్కువ హాజరయ్యారు. అదెలా అంటే కొత్త అసెంబ్లీ సమావేశం అయిన తరువాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి వచ్చారు. ఆ తరువాత కొత్త ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ ప్రసంగానికి రెండవసారి వచ్చారు. ఇక ఈ ఏడాదిలో పూర్తి బడ్జెట్ ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి మరోసారి వచ్చారు.
జగన్ అపుడూ ఇపుడూ బడ్జెట్ సెషన్ కి హాజరు కాలేదు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని ఆయన సభలో కూర్చుని చూసింది లేదు, మాట్లాడింది లేదు. ఇక కట్ చేస్తే 2023 డిసెంబర్ లో కొలువు తీరిన తెలంగాణా అసెంబ్లీకి కేసీఆర్ రెండు అంటే రెండే సార్లు వచ్చారు. ఆయన కూడా రెండు సార్లూ బడ్జెట్ కి ముందు గవర్నర్ స్పీచ్ కే వచ్చారు.
ఇక తాజాగా మార్చి 12న మొదలైన తెలంగాణా అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడినపుడు కేసీఅర్ సభలో ఉన్నారు. అలా ఆయన ఒక నలభై నిముషాలు సభలో ఉండి వెళ్ళిపోయారు. బుధవారం సభలో బడ్జెట్ ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్న పుడు ఆయన సభకు రాలేదు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని అధికార కాంగ్రెస్ ని నిలదీస్తారని అంతా అనుకున్నారు.
కానీ ఆయన వచ్చింది గవర్నర్ ప్రసంగానికి మాత్రమే. అయితే కేసీఆర్ సభకు రాకపోయినా బీఆర్ఎస్ సభ్యులు హాజరవుతున్నారు. వారే అధికార కాంగ్రెస్ ని ఢీ కొడుతున్నారు. అయితే సభకు కేసీఅర్ ని రమ్మనమని బడ్జెట్ మీద డిబేట్ లో పాల్గొనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్స్ ని కోరారు. తమ బడ్జెట్ మీద కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలని సవాల్ కూడా చేశారు.
అయితే కేసీఆర్ సభకు హాజరు కాకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు మంత్రులు తప్పు పడుతున్నారు. సభకు రాని కేసీఆర్ కి ప్రతిపక్ష నేత పదవి ఎందుకు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ తన బాధ్యతలను కేటేఅర్ లేదా హరీష్ రావులకు అప్పగిస్తే బాగుంటుంది అని సూచించారు.
మరో వైపు చూస్తే కేసీఆర్ సభకు గైర్ హాజరు కావడం పట్ల చర్చ సాగుతోంది. దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు అయింది. కాంగ్రెస్ అయితే ఇదే విషయం జనం ముందు ఉంచి బీఆర్ఎస్ ఎండగట్టాలని చూస్తోంది. ఇంకో వైపు చూస్తే కనుక ఏపీలో జగన్ విషయంలోనూ ఇవే విమర్శలను కూటమి మంత్రులు పెద్దలు చేస్తున్నారు. సభకు హాజరు కాకపోవడాన్ని పూర్తిగా ఎండగడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు అని నిందిస్తున్నారు.
ఇక చూస్తే కేసీఆర్ తమ పార్టీ నాయకులు అయిన కేటీఆర్ హరీష్ రావుల ద్వారా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నారు. జగన్ అయితే శాసన మండలిని ఆసరాగా చేసుకుని అధికార కూటమి దూకుడుకు బ్రేకులు వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే కనుక అసెంబ్లీకి ఈ ఇద్దరు నేతలూ కూడబలుక్కున్నట్లుగానే ఒకటి రెండు సందర్భాలలో తప్ప రాకుండా ఉండడం మీద తెలుగు రాజకీయాల్లో చర్చ సాగుతోంది.