ఇక‌, ప‌వ‌న్ పాలిటిక్సే.. త‌మ్ముళ్లు స‌ర్దుకోవాల్సిందే..!

ఇప్పుడు టీడీపీ నేత‌లు ఆగ్ర‌హంతోనో ఆవేశంతోనో ప‌వ‌న్‌పై వ్యాఖ్య‌లు చేసినా.. జ‌న‌సేన ను తిట్టిపోసినా.. అది మొత్తానికే ఇబ్బంది పెడుతుంద‌ని.. ఈ గ్యాప్‌ను వైసీపీ పంచుకునే అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు యోచిస్తున్నారు.;

Update: 2025-03-19 22:00 GMT

రాష్ట్రంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కూట‌మి పార్టీల్లో త‌ల‌కో ర‌కంగా రాజ‌కీయాలు చేసే పార్టీలు ఉన్నా.. ఇక నుంచి ఏక‌ప‌క్షంగా రాజ‌కీయాలు సాగ‌నున్నాయ‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. అంద‌రిదీ ఒకే మాట‌.. అంద‌రిదీ ఒకే బాట.. అన్న‌ట్టుగా రాజ‌కీయాలు ఉండ‌నున్నాయి. అదే.. ప‌వ‌న్ పాలిటిక్స్‌! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. వాస్త‌వ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌వ‌న్ చేసే వ్యాఖ్య‌లు.. ఒక్కొక్క‌సారి చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

గ‌తంలో హిందీని కాద‌న్న ప‌వ‌న్‌.. ఇప్పుడు త‌ప్పేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో ప్రాంతీయ భాష‌కే ప‌ట్టం క‌ట్టాల‌న్న ప‌వ‌న్‌.. త‌ర్వాత‌.. హిందీ మాత్రం మ‌న‌ది కాదా? అని నిల‌దీస్తున్నారు. ఇక‌, వైసీపీపైనా ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా.. ప‌వ‌న్.. రాజ‌కీయంగా రాష్ట్రంలో కూట‌మికి ఉన్న సానుకూల‌త‌ను చాలా జాగ్ర‌త్త‌గా కాపాడుతున్న పరిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో కొన్ని వివాదాలు కూడా వ‌స్తున్నాయి.

45 ఏళ్ల టీడీపీని తానే నిల‌బెట్టాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. స‌హ‌జంగానే ఈ వ్యాఖ్య‌.. టీడీపీ నేత‌ల‌కు ఇబ్బంది క‌లిగించింది. నిజానికి తామే కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని(వాజ‌పేయి) ఏర్పాటు చేశామ‌ని.. ప్ర‌స్తుత మోడీ స‌ర్కారుకు సైతం తామే అండ‌గా నిలిచామ‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబే చెబుతున్న ద‌రిమిలా.. ప‌వ‌న్ ఇలా త‌మ‌ను తృణీక‌రించ‌డం స‌రికాద‌న్న చ‌ర్చ ఉంది. కానీ, ఎవ‌రూ నోరు విప్ప‌లేదు. అదేవిధంగా పిఠాపురంలో నిర్వ‌హించిన స‌భ‌లో నాగ‌బాబు చేసిన ఖ‌ర్మ వ్యాఖ్య‌లు కూడా టీడీపీ నేత‌ల‌ను ఇబ్బంది పెట్టాయి.

అయినా.. ఏమీ అన‌లేదు. దీనికి కార‌ణం.. పైన చెప్పుకొన్న‌ట్టుగా.. ప‌వ‌న్ పాలిటిక్స్‌కే చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు టీడీపీ నేత‌లు ఆగ్ర‌హంతోనో ఆవేశంతోనో ప‌వ‌న్‌పై వ్యాఖ్య‌లు చేసినా.. జ‌న‌సేన ను తిట్టిపోసినా.. అది మొత్తానికే ఇబ్బంది పెడుతుంద‌ని.. ఈ గ్యాప్‌ను వైసీపీ పంచుకునే అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు యోచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే స‌ర్దుకుపోయే విధానం వైపే ఆయ‌న దూకుడుగా ఉంటున్నారు. ఇదే విష‌యంపై త‌మ్ముళ్లు మాత్రం మౌనంగా ఉంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News