పొలిటికల్ సినీ స్టార్స్.. తెలంగాణలో కొత్త ట్రెండ్
విజయశాంతి విషయం పక్కనపెడితే అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి సినిమాలు మాత్రం క్రేజ్ పెంచుతున్నాయి.;
సాధారణంగా సినీ నటులు ఓ స్థాయికి చేరుకున్నాక, ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాక రాజకీయాల వైపు మళ్లుతుంటారు. కానీ, రాజకీయాల్లో ఓ స్థాయికి చేరుకున్న నేతలు సినిమాల్లోకి నటించడం అంటే చాలా అరుదు. ఇప్పటివరకు అలాంటి చరిత్ర పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న వారి సంఖ్య తగ్గుతుంటే.. రాజకీయాల్లో బిజీగా ఉన్న నాయకులు సినీ హీరోలు అయిపోతున్నారు. ఈ కొత్త ట్రెండ్ కు తెలంగాణ వేదిక అవుతుండటమే ఆసక్తి పెంచుతోంది.
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో సినీ రంగం వారు ఎక్కువగా ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంటారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు ఆయన పార్టీలోనే ఉన్న నాగబాబు, పృధ్విరాజ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు టీడీపీతో చాలా మంది నటులు, నిర్మాతలు ఎప్పటి నుంచో అనుబంధం కొనసాగిస్తున్నారు. ఇక వైసీపీలో పోసాని క్రిష్ణమురళి, అలి వంటివారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తెలంగాణలో మాత్రం సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి పేర్లు ఒకటి రెండు మాత్రమే వినిపిస్తాయి. ఎమ్మెల్సీ విజయశాంతి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, బండ్ల గణేష్ మాత్రమే సినీ రంగం నుంచి తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
అయితే ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి విషయం పక్కనపెడితే, రాజకీయాల్లో విరామం, విశ్రాంతి లేకుండా తిరుగుతున్నవారు వెండి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు కథనాయకులుగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ హీరోగా ఇండియా ఫైల్స్ అనే చిత్రం మూడేళ్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూడా ఓ పాత్ర చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జులైలో విడుదల కానుంది. తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలతోపాటు భారత రాజ్యాంగం, హక్కులు వంటి సామాజిక అంశాలను ఈ సినిమాలో పొందుపరచినట్లు చెబుతున్నారు. ఇకపోతే ఒకేసారి ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఇండియా ఫైల్స్ సినిమాకు నేపథ్య సంగీతాన్ని అస్కార్ డైరెక్టర్ కీరవాణి అందజేయడం విశేషం.
ఇలా అద్దంకి సినిమా ఆసక్తి పెంచుతుండగా, ఇటీవల సంగారెడ్డికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కూడా ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వస్తున్న ఉగాదికి ప్రారంభమయ్యే ఈ సినిమాకు ‘ఏ వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. సీరియస్ అండ్ సీనియర్ పొలిటీషయన్ గా బిజీబిజీగా ఉండే జగ్గారెడ్డి సినిమాల్లో నటిస్తారన్న వార్తే తెలంగాణలో ఆసక్తి పెంచుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో కథకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చేర్చుతుండటం విశేషంగా చెబుతున్నారు.
ఇలా ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కొత్త ట్రెండ్ కు తెరలేపారంటున్నారు. మరోవైపు ఇప్పటికే పాలిటిక్స్ తో పూర్తిగా యాక్టివ్ అయి సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన విజయశాంతి కూడా మళ్లీ నటనపై మోజు చూపిస్తున్నారు. తాజాగా ఆమె ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ అనే సినిమాలో నటిస్తున్నారు. దీంతో తెలంగాణ పొలిటికల్ స్క్రిన్ కు కొత్త కళ వచ్చిందంటున్నారు. విజయశాంతి విషయం పక్కనపెడితే అద్దంకి దయాకర్, జగ్గారెడ్డి సినిమాలు మాత్రం క్రేజ్ పెంచుతున్నాయి. ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో కానీ, వారి సినిమాలపై మాత్రం పెద్ద చర్చే జరుగుతోంది.