బుచ్చయ్యా... ఎనిమిది పదుల వయసులో ఈ ఫిట్ నెస్ ఏందయ్యా?

ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-20 08:50 GMT

ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో హోదాలు, వయసు అన్నీ పక్కనపెట్టి తగ్గేదేలే అంటూ దుమ్మురేపుతున్నారు. గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన తర్వాత చిన్న పిల్లల్లాగా కేరింతలు కొడుతూ.. ఒక్కసారిగా చిన్ననాటి రోజుల్లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అవును... ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడాపోటీల్లో దుమ్మురేపుతున్నారు. వీరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎనిమిది పదుల వయసులోనూ ఆయన సరికొత్త సందడి చేశారు. ప్రత్యేకంగా.. అటు కబడ్డీలోనూ, ఇటు 100 మీటర్ల పరుగుపందెంలోనూ పాల్గొనడం గమనార్హం.

 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడమే కాకుండా.. లక్ష్యాన్ని చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో.. బుచ్చయ్య చౌదరి ఫిట్ నెస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఇటీవలే బుచ్చయ్య చౌదరి బర్త్ డే ని కార్యకర్తలు ఘనంగా సెలబ్రేట్ చేశారు.

ఎనిమిది పదుల వయసులోనూ ఆయన ప్రజాసేవ చేస్తూ.. ఈ వయసులోనూ ప్రజల వద్దకు తిరుగుతూ.. చిన్నపాటి కార్యకర్తకు కూడా టచ్ లో ఉంటూ.. ఎవరినీ మరిచిపోకుండా ఉంటూ.. ఈ వయసులో తాజాగా కబడ్డీ పోటీల్లో పాల్గొనడం గమనార్హం. దీంతో... బుచ్చయ్య మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు ప్రజానికం!

ఇదే సమయంలో... ఎనిమిది పదుల వయసులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కూడా ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఆయన పంచె కట్టుకుని షాట్ పుట్ విభాగంలో పాల్గొన్నారు.

ఆటలో గాయాలు!:

ఆటలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గాయాలయ్యాయి. ఇందులో భాగంగా... కబడ్డీలో ప్రత్యర్థి టీం సభ్యులు కూతకు వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో వెనక్కి వెళ్తూ బుచ్చయ్య చౌదరి కిందపడిపోయారు. దీంతో.. ఆయన తలభాగంలో కుర్చీ తగిలి గాయమైంది. ఇదే సమయంలో.. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ కూడా కాలికి దెబ్బతగిలి ఇబ్బందిపడ్డారు.

Tags:    

Similar News