ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... షాకింగ్ గా మావోయిస్టుల మృతుల సంఖ్య!

ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది.;

Update: 2025-03-20 09:42 GMT

2026 నాటికి దేశంలో మావోయిస్టు అనే మాట వినిపించదని, వారందరినీ తుడిచిపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 6న ప్రకటించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి దండకారణ్యాల్లో ఆపరేషన్స్ అవిరామంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9న ఛతీస్ గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్ కౌంటర్ జరగగా.. అందులో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు!

ఇందులో భాగంగా... బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని.. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని తెలిపారు! ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇదే క్రమంలో... అదే ఛత్తీస్ గఢ్ లో తాజాగా మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

అవును... ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. తాజాగా బీజాపుర్, కాంకేర్ జిల్లాల్లో ఒకేరోజు వేర్వేరు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో బీజాపుర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ కూడా అమరుడైనట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... బీజాపుర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో నక్సల్స్ నక్కినట్లు తమకు నిఘా సమాచారం అందిందని.. దీంతో జిల్లాల సంయుక్త బలగాలు గురువారం ఉదయం 7 గంటల నుంచి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయని.. ఈ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు!

ఈ ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరోపక్క కాంకెర్ జిల్లాలోనూ ఇదే సమయంలో ఎన్ కౌంటర్ జరిగిందని.. ఇక్కడ నలుగురు మావోయిస్టులు మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా... ఈ ఏడాది ఇప్పటికే రెండు వరుస భారీ ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జనవరి 20న ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లోని నౌపాడ, గరియాబంద్ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లో 20 మంది మావోలు చనిపోగా.. ఫిబ్రవరి 9న బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది నక్సలైట్లు మృతి చెందారు.

Tags:    

Similar News