'డ్రమ్ములో నాన్న ఉన్నాడు'.. హత్య కేసులో ఆరేళ్ల కూతురి మాటలు నిజం!

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరఠ్ లో చోటుచేసుకున్న సౌరభ్ రాజ్ పుత్ హత్యకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.;

Update: 2025-03-20 11:30 GMT

ప్రేమించి పెళ్లి చేసుకుని, మర్చంట్ నేవీ అధికారిగా ఉద్యోగం చేస్తున్న భర్తను ప్రియుడి సాయంతో దారుణంగా హత్య చేసి, సుమారు 15 ముక్కలుగా చేసిన భార్య కథ తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను ఉరి తీయాలంటూ ఆమె తల్లితండ్రులే కోరుతున్న పరిస్థితి. ఈ సమయంలో వాళ్ల ఆరేళ్ల కూతురు తన తండ్రిని ఎక్కడ మాయం చేసింది చెప్పడం కలిచి వేస్తోంది!

అవును... ఉత్తర్ ప్రదేశ్ లోని మీరఠ్ లో చోటుచేసుకున్న సౌరభ్ రాజ్ పుత్ హత్యకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఈ హత్యను మృతుడి ఆరేళ్ల కుమార్తె చూసి ఉంటుందని.. అందువల్లే తన తండ్రి ఒక డ్రమ్ముల్లో ఉన్నాడంటూ చుట్టుపక్కల వారికి ఆ పాప చెప్పినట్లు చెబుతున్నారు. ఈ విషయం సంచలనంగా మారింది.

తాజాగా ఈ విషయాలపై మృతుడు సౌరభ్ రాజ్ పుత్ తల్లి స్పందించారు. ఇందులో భాగంగా... తన కుమారుడిని మార్చి 4న అతడి భర్య, ప్రియుడు కలిసి చంపేశారని.. అనంతరం వారిద్దరూ ట్రిప్ కు వెళ్లారని.. తిరిగొచ్చిన తర్వాత మరమ్మత్తుల కోసమని వారుంటున్న ఇంటి యజమాని కూలీలను తీసుకొచ్చారని.. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఓ డ్రమ్మును లేపలేకపోయారని తెలిపారు.

దీనిపై తమ కోడలు ముస్కాన్ ను అడిగితే.. అందులో చెత్త ఉందని చెప్పిందని.. మూత తీసి చూస్తే మాత్రం భరించలేని దుర్వాసన వచ్చిందని.. దీంతో ఇంటి యజమానికి సందేహం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. దీంతో.. విషయం తెలుసుకున్న కోడలు.. పోలీసులు వచ్చే లోపు అక్కడ నుంచి వెళ్లిపోయిందని ఆమె వెల్లడించారు.

అయితే... తమ ఆరేళ్ల మనవరాలికి కూడా ఈ హత్య గురించి తెలిసే ఉంటుందని.. అందుకే అస్తమానం పొరిగింటివారితో తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఆ చిన్నారి చెప్పేదని.. ఆ విషయం గ్రహించే ముస్కాన్ బాలికను వేరే చోటుకు పంపించేసిందని సౌరభ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా... ఉత్తరప్రదేశ్ కి చెందిన ముస్కాన్ రస్తోగి, సౌరభ్ రాజ్ పుత్ లు 2016లో ప్రేమ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఈ క్రమంలో ముస్కాన్ కు సాహిల్ శుక్లాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే సమయంలో... సౌరభ్ ఉద్యోగం మానేసి విదేశాలకు వెళ్లిపోయారు.

అయితే... గత నెల కుమార్తె పుట్టిన రోజు ఉండటంతో అతడు తిరిగి ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి అతడికి మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టింది. అనంతరం మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి.. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంట్ తో కప్పిపెట్టారు. ఆ విషయం వారి ఆరేళ్ల కుమార్తెకు తెలిసే... నాన్న డ్రమ్ములో ఉన్నాడని పదే పదే చెబుతోందని అంటున్నారు.

Tags:    

Similar News