ఏపీకి వచ్చిన కాదంబరీ జెత్వానీ.. వైసీపీలో టెన్షన్
ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జెత్వానీ ఏపీకి వచ్చారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను కలిశారు.;
ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జెత్వానీ ఏపీకి వచ్చారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను కలిశారు. గత ప్రభుత్వంలో ఆమెపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె డీజీపిని కలిసి తనపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరారు. మరోవైపు జెత్వానీ రావడంతో ఏం జరుగుతోందని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు.
ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీపై అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టు అయ్యారు. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీని సస్పెండ్ చేశారు. ఇటీవలే వారి సస్పెన్షన్ ను మరో ఆరు నెలలు పొడిగించారు.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ స్థలానికి సినీ నటి కాదంబరి జెత్వానీ తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి విక్రయించాలని చూశారని ఆమెపై గత ప్రభుత్వంలో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు కాదంబరి జెత్వానీ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఆమె తప్పుడు కేసు పెట్టారని తేల్చారు. ఈ కేసులో వైసీపీ నేత విద్యాసాగర్ అరెస్టు కాగా, ఐపీఎస్ అధికారులపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని తేల్చిన పోలీసులు, ఆ కేసులను ఇంతవరకు ఎత్తివేయలేదని కాదంబరి జెత్వానీ చెబుతున్నారు. తప్పుడు కేసులను వెంటనే తీసివేయాలని డీజీపీని కలిసి కోరారు.