రామానాయుడు స్టూడియో భూమి తీసుకోవాల్సిందే - టీడీపీ ఎమ్మెల్యే

శాసనసభలో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి విషయం మీద జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు.;

Update: 2025-03-20 10:11 GMT

విశాఖ నుంచి భీమిలీ వైపు వెళ్ళే మార్గంలో ఉన్న రామానాయుడు స్టూడియోలో మిగులు భూమి మీద చాలా కాలంగా వివాదం ఉంది. ఈ భూమిని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు కోరుతున్నారు. శాసనసభలో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి విషయం మీద జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు.

రామానాయుడు స్టూడియోకు ప్రభుత్వం దాదాపుగా 35 ఎకరాల భూమిని ఇస్తే అందులో మిగులు భూమిగా 15 ఎకరాలు ఉందని దానిని స్టూడియో అభివృద్ధి కోసం కాకుండా వేరే విధంగా వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ భూములను లే అవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వంలో ప్రయత్నించారని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంలో తాను సుప్రీమ్ కోర్టు దాకా వెళ్ళి ఆపించాను అని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా ఇన్నేళ్ళ కాలంలో రామానాయుడు స్టూడియోలో ఈ భూమిని సినీ కార్యకలాపాల కోసం వాడలేదని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఏ ప్రయోజనాల కోసం అయితే ప్రభుత్వం ఆ భూమిని ఇచ్చిందో దానిని అలా వాడకపోతే వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.

ఇదిలా ఉంటే 2000 ప్రాంతంలో తెలుగుదేశం ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖలో ఈ భూమిని రామానాయుడు స్టూడియో కోసం ఇచ్చారు. అందులో దాదాపుగా ఇరవై ఎకరాల వరకూ స్టూడియో కోసమే వినియోగించారు. మిగులుగా మరో 15.17 ఎకరాలు ఉంది.

దీని విషయంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు అనుమతులు తీసుకుని లే అవుట్లు వేసేందుకు ప్రయత్నించారు అని ప్రచారం లో ఉంది. అయితే దీని మీద అపుడే టీడీపీ నేతలు విమర్శలు చేశారు. మొత్తానికి ఇది ఆగింది. ఇపుడు ఈ భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని వెలగపూడి ఎమ్మెల్యే హోదాలో కోరుతున్నారు. ప్రభుత్వం ఈ భూమి తీసుకుంటుందా లేక స్టూడియో యాక్టివిటీని ప్రారంభించాలని కోరుతుందా అన్నది చూడాలి.

కారణాలు ఏమైనా ఒకసారి ఒకరికి భూమి ఇచ్చినపుడు తిరిగి తీసుకున్న సందర్భాలు అరుదుగానే ఉన్నాయి. దాంతో పాటు సినీ పరిశ్రమను విశాఖ తో పాటు ఏపీకి రప్పించాలని ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే కోరినట్లుగా ప్రభుత్వం ఆలోచిస్తుందా అన్నదే చూడాల్సి ఉంది. ఏది ఏమైనా రామానాయుడు స్టూడియో ఒక్కటే ఏపీలో అందునా విశాఖలో ఉంది. దాని చుట్టూ రాజకీయ వివాదాలు విమర్శలు కొంతకాలంగా వస్తున్నాయి. మరి ఇలాగైతే పరిశ్రమ వర్గాలు ఈ వైపు చూస్తాయా అన్నది మరో చర్చగా ఉంది.

Tags:    

Similar News