’ఆటగాడు’ తగులుకుంటే.. ఎంతటి తోపు బెట్టింగ్ అయినా తోకముడవాలె!
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు పంజా విసురుతున్నారు.;
‘‘అన్వేషన్న తోపు.. బెట్టింగ్ యాప్స్ ఆపు..’’ ఇక మీదట ఈ టైటిల్ ను ట్రెండింగ్ చేయాలేమో..? ఔను.. ఇప్పుడు తెలంగాణ పోలీసులు మాంచి దూకుడు మీద ఉన్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు పంజా విసురుతున్నారు. ’’సే నో టూ బెట్టింగ్ యాప్స్’’ హ్యాష్ ట్యాగ్ తో సీనియర్ ఐపీఎస్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉద్యమం మొదలుపెట్టారు. దీనికి సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. కాసులకు కక్కుర్తిపడి మోసపూరిత యాప్ లకు ప్రచారం చేస్తే ఎంతటివారికైనా కటకటాలు తప్పవన్న హెచ్చరికగా.. ఒకే రోజు 11 మందిపై కేసులు.. నోటీసులు జారీ అయ్యాయి. గమనార్హం ఏమంటే ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మిపైనా కేసుకు రంగం సిద్ధం కావడం. ఈ కేసుల భయంతో ఇన్‌ఫ్లూయెన్సర్లకు దిమ్మతిరిగి దిగొస్తున్నారు. ఇకమీదట తాము ఎవరికీ ప్రచారం చేయబోమంటూ సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు.
నా అన్వేషణ తోడుగా..
బెట్టింగ్ యాప్ లపై సజ్జనార్ ఉద్యమం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, దీనికి పునాది గత వారం పడింది. ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అయిన అన్వేష్ తో సజ్జనార్ గత వారం సంభాషించారు. ఐదేళ్లలోనే అత్యంత ప్రముఖుడిగా మారిపోయిన అన్వేష్.. ‘నా అన్వేషణ’ పేరిట యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ ప్రపంచం అంతటా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. లక్షల మంది సబ్ స్ర్కైబర్లు, కోట్ల వ్యూస్ ఉన్నప్పటికీ ఎప్పుడూ కనీసం రూపాయి బెట్టింగ్ ను కూడా ప్రమోట్ చేయని నిజాయతీ అన్వేష్ ది. దీనికి కారణం అతడి తండ్రి బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకోవడమే. అందుకనే అన్వేష్ తో మాట్లాడిన సజ్జనార్ తన ఉద్యమానికి ఊపిరి పోశారు. ఇప్పుడది మహా ఉద్యమంగా మారుతోంది.
అన్వేష్ యుద్ధం మొదలుపెడితే..
‘ఆటగాడు’గా సోషల్ మీడియాలో అందరికీ బాగా పరిచయమైన అన్వేష్ ప్రముఖ యూట్యూబరే కాదు.. నిజాయతీపరుడు. గతంలో మల్టీ చానల్ నెట్ వర్క్ ను (ఎంసీఎన్) అడ్డంపెట్టుకుని యూట్యూబర్లు కొందరు మోసాలకు పాల్పడుతున్నారంటూ వెలుగులోకి తెచ్చాడు. దీంతో ఆయా యూట్యూబర్ల ఫేమ్ పడిపోయింది.
గత ఏడాది సరిగ్గా ఇదే రోజుల్లో ఫేమస్ బైక్ రైడర్ ఒకరు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న విషయాన్ని కూడా అన్వేష్ బయటపెట్టాడు. ఇలా ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ దందాకు పక్కలో బల్లెంలా మారాడు. ఇప్పుడు అన్వేష్ కు సజ్జనార్ రూపంలో పెద్ద అండ తోడు దొరికింది.
దేశ ఆర్థిక వ్యవస్థకు, యువత భవిష్యత్ కు ముప్పుగా పరిణమించిన బెట్టింగ్ యాప్స్ కు అడ్డుకట్ట వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అభినందిద్దాం.