కేబినెట్ ర్యాంక్ హోదాతో బొత్స మారిపోయారా ?
వైసీపీలో ఆయన ఒకే ఒక్కరుగా ఉన్నారు. ఆయనకు మాత్రమే కేబినెట్ హోదాతో కూడిన పదవి ఉంది.
వైసీపీలో ఆయన ఒకే ఒక్కరుగా ఉన్నారు. ఆయనకు మాత్రమే కేబినెట్ హోదాతో కూడిన పదవి ఉంది. అధినేత జగన్ సైతం సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నారు. వైసీపీలో అయిదేళ్ల పాటు మంత్రిగా కేబినెట్ హోదాను అనుభవించిన బొత్స 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే వెంటేనే ఎమ్మెల్సీగా నెగ్గి లక్కీ చాన్స్ కొట్టేశారు. ఆ విధంగా ఆయనకు శాసనమండలిలో లీడర్ ఆఫ్ అపొజిషన్ హోదా కూడా దక్కింది.
అదే హోదా కోసం వైసీపీ అసెంబ్లీలో పోరాడినా ఫలితం లేకపోయింది. రూల్స్ అనుమతించవని అంటున్నారు. దాంతో జగన్ తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఇక వైసీపీలో పెద్ద దిక్కుగా బొత్స మాత్రమే కనిపిస్తున్నారు. ఆయనకు అధికారికంగా ప్రోటోకాల్ కూడా ఇస్తున్నారు.
ఇలా తనకు తగిన హోదా దక్కడంతో బొత్స కూడా తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చేశారు అని అంటున్నారు. ఆయన కాపీ టూ చంద్రబాబు కాపీ టూ గవర్నమెంట్ అంటూ లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు. ఆయనలో కనిపిస్తున్న కొత్త పోకడ ఇదే అని అంటున్నారు.
ఆయన ఏ ప్రజా సమస్యను అయినా మీడియా మీటింగు కంటే ముందే ప్రభుత్వానికి లేఖలు రాయడం అలవాటుగా చేస్తున్నరు. ఆ లేఖల దిగువన ఎటూ లీడర్ ఆఫ్ అపొజిషన్ అన్న రాజముద్ర ఉంటుంది. దాంతో తాను రాసే లేఖలకు తగిన విలువ ఉంటుందని బొత్స భావిస్తున్నారు. ఆయన రాసిన లేఖలకు కూడా ప్రభుత్వం నుంచి జవాబు వస్తోందిట.
ఆయన తరచూ లేఖలు రాస్తూ ప్రభుత్వాన్ని ఆ విధంగా నిలదీస్తున్నారు. ప్రభుత్వాన్ని కొన్ని సార్లు ఇరుకున పెట్టే విధంగానూ బొత్స లేఖలు ఉంటున్నాయి. ఉదాహరణకు చూస్తే కనుక విశాఖలో చోటు చేసుకున్న భూ కుంభకోణం మీద బొత్స లేఖ రాశారు.
టీడీపీ 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నపుడు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. వాటి మీద వైసీపీతో పాటు వామపక్షాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. దాంతో చంద్రబాబు ప్రభుత్వం సిట్ ని ఒక దానిని ఏర్పాటు చేసింది.
ఇక ఆ సిట్ నివేదికను బహిర్గతం చేయమని బొత్స లేటెస్ట్ గా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆనాడు విశాఖలో జరిగిన భూ కుంభకోణాల మీద అప్పటి మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్యలో కూడా రాజకీయ దుమారం పరోక్ష విమర్శలతో కాక పుట్టించేలా అంతా సాగింది.
ఇపుడు ఆ భూ కుంభకోణం మీద చంద్రబాబు ప్రభుత్వం నుంచి సిట్ నివేదికను బొత్స కోరడం ద్వారా ఒక విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు అని అంటున్నారు. ఏళ్ళకు ఏళ్ళు గడుస్తున్నా సిట్ నివేదిక బయటకు రాకపోవడమేంటి అని బొత్స తన లేఖలో ప్రశ్నించారు.
ఈ సిట్ నివేదికలో పేర్కొన్న వారిలో టీడీపీ ముఖ్యులు ఉంటే వారికి నాటి ప్రభుత్వం నుంచి ఉపశమనం కలిగితే దానిని రాజకీయ ఆయుధంగా మార్చుకోవాలన్న పక్కా వ్యూహంతోనే బొత్స ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఈ రోజున వైసీపీ అయిదేళ్ల పాలనలో భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపిస్తున్న టీడీపీకి ఇది సరైన జవాబు అవుతుందని కూడా లెక్క వేసుకుని మరీ పక్కాగా ఆయన తన లేఖల పధకాన్ని అమలు చేస్తున్నారు అని అంటున్నారు.
లీడర్ ఆఫ్ అపొజిషన్ అయ్యాక బొత్స ఇప్పటికే విశాఖ డ్రగ్ కంటైనర్ మీద ఏమి జరిగిందో చెప్పాలని లేఖ సంధించారు. అది ఇటీవలే ఒక కొలిక్కి వచ్చింది. సీబీఐ కూడా అసలు విషయం చెప్పింది. ఇక విజయనగరం భూముల విషయం మీద బొత్స మరో లేఖ సంధించారు. విద్యుత్ ఛార్జీల మీద కూడా ఆయన లేఖాస్త్రం వదిలారు. ఇలా ప్రభుత్వాన్ని ఆయన తనకు దక్కిన హోదాతో ఇరుకున పెట్టేందుకు వాడుకుంటున్నారని తద్వారా తన మీద పార్టీ మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారని అంటున్నారు. మొత్తానికి బొత్స ఏపీలో లేఖలతో కూటమి సర్కార్ మీద రాజకీయ సమరం సాగిస్తున్నారు అని చెప్పాల్సి ఉంది.