తప్పుగా తాకినోడి తాట తీసేందుకు 10 టీంలు.. 100 సీసీ కెమెరాల్లో జల్లెడ

అవును.. నేరం చిన్నదా? పెద్దదా? అన్నది కాదు. తప్పుడు పని చేసినోడి తాట తీసేందుకు పోలీసులు ఎంత కఠినంగా ఉన్నారన్న విషయం నేరస్తులకు తెలియాల్సిన అవసరం ఉంది.

Update: 2024-10-02 04:40 GMT

అవును.. నేరం చిన్నదా? పెద్దదా? అన్నది కాదు. తప్పుడు పని చేసినోడి తాట తీసేందుకు పోలీసులు ఎంత కఠినంగా ఉన్నారన్న విషయం నేరస్తులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భారీగా శ్రమించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన ఒక ఉదంతంలో రాచకొండ పోలీసులు ప్రదర్శించిన కమిట్ మెంట్ గురించి తెలిస్తే అభినందించకుండా ఉండలేం. ఒక పోకిరీని పట్టుకోవటానికి 10 టీంలు.. 100కు పైగా సీసీ కెమెరాలు.. 300 టూవీలర్లను జల్లెడ వేసి మరీ ఆ ఆకతాయిని పట్టుకున్న వైనం ఆసక్తికరంగా మారింది.

ఆడపిల్లల్ని అసభ్యంగా తాకుతూ.. మెరుపువేగంతో మాయమయ్యే ఇతగాడి కోసం చేపట్టిన గాలింపు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఇదెక్కడ జరిగింది? అసలేమైంది? అన్న వివరాల్లోకి వెళితే.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో సెప్టెంబరు 21న మధ్యాహ్నం ఒక యువతి తన ఇంటికి కొద్ది దూరంలో ఫోన్ మాట్లాడుతోంది. ఆమె ఫోన్ మాట్లాడుతున్న వేళలో.. టూవీలర్ మీద దూసుకొచ్చిన ఒకడు.. ఆమె శరీర భాగాల్ని అసభ్యంగా తాకుతూ వెళ్లాడు. వాడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. టూవీలర్ మీద వేగంగా వెళ్లిపోయాడు.

దీంతో.. బాధిత యువతి రాచకొండ పోలీసులకు వాట్సాప్ లో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని వివరిస్తూ లేఖ రాసింది. దీన్ని ఫిర్యాదుగా తీసుకున్న రాచకొండ పోలీసులు.. సదరు పోకిరీని పట్టుకోవటానికి భారీ ఎత్తున శ్రమించారు. ఆ యువతి సమాచారాన్ని రాచకొండ షీటీమ్స్ కు బదిలీ చేసిన సీపీ సుధీర్ బాబు నిందితుడ్ని పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

అయితే.. ముఖానికి ముసుగు.. టూవీలర్ నెంబరు ప్లేట్ కు మాస్కు తగిలించిన ఆ యువకుడ్ని గుర్తించటం సవాలుగా మారింది. దీంతో.. అతడ్ని గుర్తించేందుకు వీలుగా పది ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయటంతో పాటు..నిందితుడి వాహనం ప్రయాణించిన మార్గాల్ని గుర్తించేందుకు ఏకంగా 100కు పైగా సీసీ కెమురాలను.. 300లకు పైగా టూవీలర్ల రిజిస్ట్రేషన్ నంబర్లను జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మరో అరాచకాన్ని గుర్తించారు. ఈ ఆకతాయి నాలుగు కిలోమీటర్ల పరిధిలోనే చక్కర్లు కొడుతూ యువతుల్ని అసభ్యంగా తాకుతూ వెళ్లిన వైనం వారి ద్రష్టికి వచ్చింది. మహిళా హాస్టళ్ల వద్ద తప్పుడు చేష్టలకు పాల్పడ్డాడు. చివరకు.. పోలీసులు సదరు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

మహిళల విషయంలో తప్పుగా ప్రవర్తించిన వారిని అదుపులోకి తీసుకోవటానికి ఎంత శ్రమకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించిన తీరును అభినందించాల్సిందే. అంతేకాదు.. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 30 తేదీ వరకు డెకాయ్ ఆపరేషన్లతో 268 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న వైనం చూసినప్పుడు.. ఇలాంటి వారి తాట తీయాల్సిన అవసరం ఉందని చెప్పాలి.

Tags:    

Similar News