ఎప్పటి కోరికో ఇది...మనసు విప్పిన టీటీడీ చైర్మన్!

ఇక టీటీడీ చైర్మన్ పదవి కోరిక ఈనాటిది కాదని బీఆర్ నాయుడు తన మనసులోని విషయాలు బయటపెట్టారు.

Update: 2024-11-13 03:57 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అంటే సామాన్యమైనది కాదు, ఎంతో గొప్పది. ఎందుకంటే కలియుగ దైవం దేవ దేవుడి సేవలో తరించే పోస్టు అది. ఆ పదవి కోసం ఎందరో ఆశ పడతారు అయితే ఆయన కరుణ ఎవరి మీద ఉంటే వారినే వరిస్తుంది.

ఇపుడు ఒక ప్రముఖ టీవీ మీడియా సంస్థ అధినేత బీఆర్ నాయుడుని ఈ పదవి వరించింది. దాంతో ఆయన సంతోషం అంతా ఇంతా కాదు. తనకు ఈ పదవి దక్కినందుకు ఆయన దేవుడికి ధన్యవాదాలు చెబుతూనే అది దక్కించినందుకు చంద్రబాబు పవన్ లోకేష్ లకి కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఇక టీటీడీ చైర్మన్ పదవి కోరిక ఈనాటిది కాదని బీఆర్ నాయుడు తన మనసులోని విషయాలు బయటపెట్టారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తనకు ఆ కోరిక కలిగిందని వెళ్ళి అడిగాను కొంత దాకా ప్రయత్నం చేశాను అని బీఆర్ నాయుడు చెప్పారు.

అయితే నాడు అది ఫలించలేదని ఇపుడు సాకారం అయింది అని అన్నారు. ఇక చంద్రబాబు చెవిన ఏడాదిన్నర క్రితమే ఈ పదవి గురించి తాను ప్రస్తావించాను అని ఆయన అసలు విషయమూ చెప్పేశారు. తాను నలభై ఏళ్ల నుంచి బాబుతొనే ఉంటూ వచ్చానని కానీ ఏమీ అడగలేదని అన్నారు.

అదే విషయం బాబుకు చెప్పి తనకు ఆ పదవి ఇప్పించమని కోరాను అని అన్నారు. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఆ పదవికి మీరే అర్హులు అని చెప్పరని అన్నారు. ఇక ఆ తరువాత కూటమి అధికారంలోకి వచ్చిందని తాను జూన్ 29న మరోసారి వెళ్ళి చంద్రబాబుని కలసై టీటీడీ చైర్మన్ పదవి విషయం ప్రస్తావించాను అని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే చంద్రబాబు దానికి మాటిచ్చాను కాబట్టి తప్పకుండా చేస్తాను అని మరోసారి హామీ ఇచ్చారని చెప్పారు. ఎట్టకేలకు తనకు ఈ అవకాశం దక్కిందని బీఆర్ నాయుడు సంతోషం వ్యక్తం చేసారు. తనకు ఈ పదవి దక్కడం ఈ రోజుకీ ఊహకు అందని విషయంగానే ఉందని అన్నారు.

తాను ఎంతగానో వెంకటేశ్వరస్వామి వారిని ఇష్టపడతను అని ఆయన చెప్పారు. ఇపుడు ఆ స్వామికి సేవ చేసే భాగ్యం కలగడం మాటలలో వర్ణినలేని గొప్ప అనుభూతి అని ఆయన అంటున్నారు. తాను జీవితంలో ఒక్కసారి అయినా టీటీడీ చైర్మన్ కావాలని ఆ దేవుడికి సేవ చేయాలని అనుకున్నానని చెప్పారు. ఇపుడు అది తీరిందని ఆయన అంటున్నారు.

మరో వైపు చూస్తే చైర్మన్ గా తాను సామాన్య భక్తుల వైపు ఉంటాను అని అన్నారు. వారికి దర్శనం ఎక్కువ సేపు జరిగేలా చర్యలు తీసుకుంటాను అని గంటల తరబడి క్యూలలో ఉన్న వారికి కేవలం కొన్ని సెకన్ల దర్శనానికే పరిమితం చేస్తున్నారని అలా కాకుండా కనీసం ఇరవై సెకన్ల పాటు దర్శనం కల్పించాలన్నది తన ఆలోచనగా చెప్పారు. వీఐపీల కంటే సామాన్య భక్తులకు దర్శనాల మీదనే ప్రత్యేక శ్రద్ధ పెడతాను అని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి బీఆర్ నాయుడు తన జీవిత లక్ష్యం నెరవేరింది అన్న సంతోషనంలో ఉన్నారు.

Tags:    

Similar News