బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం ఏపీలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న బ్రదర్ అనిల్ క్రైస్తవుల ఓట్లను ఈసారి కాంగ్రెస్ పార్టీకి మళ్లించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది.
బ్రదర్ అనిల్ కుమార్ గురించి తెలియనివారు లేరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అల్లుడుగా, ప్రముఖ సువార్తీకుడుగా అనిల్ ఉన్నారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో బ్రదర్ అనిల్ ముఖ్య పాత్ర పోషించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులతో సమావేశాలు నిర్వహిస్తూ వారి ఓట్లను వైసీపీ వైపు మళ్లించడంలో ఆయనదే కీలకపాత్ర.
అయితే ఇప్పుడు బ్రదర్ అనిల్ భార్య వైఎస్ షర్మిల వైసీపీలో లేరు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో ఆమెకు మద్దతుగా బ్రదర్ అనిల్ సైతం తెర వెనుక కార్యకలాపాలను చక్కబెడుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న బ్రదర్ అనిల్ క్రైస్తవుల ఓట్లను ఈసారి కాంగ్రెస్ పార్టీకి మళ్లించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఏపీలో పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న అనిల్ పరోక్షంగా జగన్ ప్రభుత్వంపైన వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతోందో మీ అందరికీ తెలుసని.. అన్యాయాన్ని, అక్రమాలను ఆ దేవుడు ఓడిస్తాడని బ్రదర్ అనిల్ క్రైస్తవులతో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించే అనిల్ చేస్తున్నారని చెబుతున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లాలోని సత్యవేడుకు చడీచప్పుడు లేకుండా వచ్చిన అనిల్ అక్కడ ఒక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం కావడం గమనార్హం. అందులోనూ సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంకు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ జగన్ ఈసారి అవకాశమిచ్చారు. అయితే ఆ సీటు తనకొద్దని ఆదిమూలం తిరస్కరించారు. అంతేకాకుండా వైఎస్ జగన్ పైన, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గంలో బ్రదర్ అనిల్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సత్యవేడులో క్రైస్తవ సువార్త కార్యక్రమంలో పాల్గొన్న ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోందో తన కంటే మీకే ఎక్కువగా తెలుసని బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించారు. 'నేను పెద్దగా మాట్లాడను.. దేవుడు ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. చేయాల్సిన పనిని ఆ దేవుడే చేస్తాడు. అన్యాయాన్ని.. అక్రమాలను.. ఆ దేవుడు ఓడిస్తాడు' అంటూ బ్రదర్ అనిల్ హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తాత్కాలిక ఆనందం కోసం వేధించరాదు అని పరోక్షంగా తన భార్య షర్మిలను పోలీసులు విజయవాడలో అరెస్టు చేసిన ఉదంతాన్ని ప్రస్తావించారు.
కాగా మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా క్రైస్తవ సంఘాలను పెద్ద ఎత్తున కలవడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేయించడమే అనిల్ లక్ష్యమని అంటున్నారు.