బీఆర్ఎస్‌లో అలంపూర్ లొల్లి.. చివ‌ర‌కు జ‌రిగేదేంటి?

కానీ, అప్ప‌టి నుంచి రోజుకోర‌కంగా ఇక్క‌డి రాజ‌కీయాలు మారిపోయాయి. ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు.

Update: 2023-10-20 00:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మూడోసారి కూడా విజ‌యం ద‌క్కించుకుని హ్యాట్రిక్ కొట్టాల‌ని భావిస్తున్న బీఆర్ ఎస్ పార్టీకి కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు.. కొంద‌రు నేత‌ల వ్య‌వ‌హార శైలి ఎక్క‌డా మింగుడు ప‌డ‌డం లేదు. తెగించి నిర్ణ‌యం తీసుకుంటే ఏం జ‌రుగుతుందో అన్న బెంగ పార్టీని వెంటాడుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ కూడా చేరిపోయింది.

ఈ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ త‌ర‌ఫున 2018లో వీఎం అబ్ర‌హాం విజ‌యం సాధించారు. 44 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిణామాలు... నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగానే ఉన్న‌ప్ప‌టికీ.. టికెట్ల ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. ఒక్క‌సారిగా మారిపోయాయి. వాస్త‌వానికి తొలుత ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్ జాబితాలో అలంపూర్ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్ర‌హాం పేరును కేసీఆర్ ప్ర‌క‌టించారు.

కానీ, అప్ప‌టి నుంచి రోజుకోర‌కంగా ఇక్క‌డి రాజ‌కీయాలు మారిపోయాయి. ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు. వాస్త‌వానికి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన అలంపూర్‌లో చ‌ల్లా చ‌క్రం తిప్పుతుండ‌డం ఏంట‌నే అనుమానం రావొచ్చు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓసీల ఆధిప‌త్య‌మే సాగుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్ర‌హాంకు టికెట్ ఇవ్వొద్దంటూ.. చ‌ల్లా త‌న అనుచ‌రుల‌ను రెచ్చ‌గొట్టిన‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

దీంతో అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా అసమ్మతి తారస్థాయికి చేరుకుంది. ఈ క్ర‌మంలో రంగంలొకి దిగిన ఎమ్మెల్సీ చ‌ల్లా త‌న అనుచ‌రుడు విజేయుడుకు టికెట్ ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్టు స్థానికంగా చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలోనే జిల్లాలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు బీఫాం ఇచ్చిన కేసీఆర్ అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి అభ్య‌ర్థిని(అబ్ర‌హాం) ప్ర‌క‌టించి కూడా.. బీఫాం ఇవ్వ‌కుండా తొక్కిపెట్టారు.

ఈ ప‌రిణామంతో విస్తుపోయిన‌... అబ్ర‌హాం ఏదో ఒక‌టి తేల్చుకునేందుకు బీఆర్ ఎస్ అధినేత‌, లేదా.. కేటీఆర్‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చినా.. ఆయ‌న‌కు అప్పాయింట్ ల‌భించ‌లేదు స‌రిక‌దా.. అబ్ర‌హాం చూసి కూడా కేటీఆర్ వెళ్లిపోయారు. దీంతో మ‌న‌స్తాపానికి గురైన అబ్ర‌హాం.. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌ణాళిక‌లు రెడీ చేసుకుంటున్నారు. అయితే.. ఆయ‌న‌కు కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ ల‌భించే అవ‌కాశం లేదు. దీంతో ఒంట‌రిపోరుకు ఆయ‌న రెడీ అయ్యే అవ‌కాశం ఉంది. ఇదిబీఆర్ ఎస్ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News