ఇక, `పార్లమెంటు` పోరే.. రెడీ అవుతున్న బీఆర్ ఎస్
వీటిలో 12 కనీసం దక్కించుకోవడం ద్వారా.. పట్టు పెట్టుకునేలా వ్యూహం సిద్ధం చేస్తోంది.
మరో మూడు మాసాల్లో జరగనున్న పార్లమెంటు లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణలోని బీఆర్ ఎస్ పార్టీ రెడీ అవుతోంది. కొత్త సంవత్సరంలో తొలి రెండు మూడు రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన దరిమిలా.. లోక్‌సభలో అయినా.. పట్టు బిగించాలని.. 12 నుంచి 15 స్థానాల్లో విజయం దక్కించుకో వాలని బీఆర్ ఎస్ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో 12 కనీసం దక్కించుకోవడం ద్వారా.. పట్టు పెట్టుకునేలా వ్యూహం సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలో జనవరి 3వ తేదీ నుంచి జిల్లాల వారీగా తొలి విడత పొలిటికల్ సమీక్షలు చేసి.. నాయకులను లోక్‌సభ సమరానికి పార్టీ కార్యోన్ముఖులను చేయనుంది. అదేవిధంగా జనవరి 16 వ తేదీ నుంచి రెండో విడత సమీక్షలు నిర్వహించనున్నారు. ఇక, ఫిబ్రవరి రెండో వారం నాటికి దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఆశావ హుల జాబితాలో చాలా మంది ఉన్నారు.ముఖ్యంగా ఈ దఫా నిజామాబాద్ నుంచి మరోసారి కేసీఆర్ తనయ కవిత పోటీ చేయ నున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే నిజామాబాద్ కేంద్రంగా కవిత కూడా చక్రం తిప్పుతున్నారు. మరోవైపు.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కీలక నాయకుల్లో ముగ్గురికి లోక్‌సభ స్థానాలు కేటాయిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వారికి కేసీఆర్(ఓటమి తర్వా త నిర్వహించిన సమావేశంలో) హామీ ఇచ్చారని తెలిసింది. వీరిలో పువ్వాడ అజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనా ర్హం. అలానే, ఎస్టీ నియోజకవర్గానికి చెందిన సీటును ఈ సారి మాజీ మంత్రి రాథోడ్‌కు కేటాయించే అవకాశం ఉంది. వాస్తవానికి మొత్తం 17 ఎంపీ స్థానాల్లో 5 స్థానాలు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయాయని.. బీఆర్ ఎస్‌లో చర్చ సాగుతుండడం గమనార్హం.