``బీఆర్ ఎస్.. రాక్షసుల పార్టీ``
ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన నడ్డా.. తొలుత మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల మధ్య మాటలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ ఎస్ నేతలు ఒకటంటే.. కాంగ్రెస్, బీజేపీలు రెండంటున్నాయి. కేసీఆర్.. తాజాగా ప్రతిపక్ష పార్టీలను కుక్కలతో పోల్చడం సంచలనంగా మారింది. ఇక, ఇప్పుడు ఇదే తరహాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా నోరు చేసుకున్నారు. బీఆర్ ఎస్‌పై తాజాగా ఆయన విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన నడ్డా.. తొలుత మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కావాలన్న ప్రజల కోరిక నెరవేరినా.. ఏ ఉద్దేశంతో అయితే.. తెలంగాణను పొందారో .. ఆ ఉద్దేశాలు నెరవేరలేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఫలితాలు ప్రజలకు అందలేదని చెప్పారు.
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ కుటుంబానికే లబ్ధి జరిగిందన్నారు. ఆయన కుమారుడు మంత్రి, ఆయన కుమార్తె ఎమ్మెల్సీ, ఆయన మేనల్లుడు ఎంపీ.. ఇంకా ఎందరెందరో పదవులు పొందారని నడ్డా దుయ్యబట్టారు. ఈ నెల 30న కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నడ్డా పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించేవిగా పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ అధికంగా నిధులు కేటాయించారని, వాటితోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని నడ్డా చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించాలని నడ్డా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందన్న నడ్డా.. కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని ప్రకటించారు. మియాపూర్ భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని, దళితబంధులో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు 3 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు.