రాజయ్య‌పై కోపం.. శ్రీహ‌రికి 'న‌వ్య‌' స‌వాలేనా..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిన్న మొన్న‌టి వ‌రకు మిత్రులుగా ఉన్న వారు.. ఇప్పుడు ప్ర‌త్య‌ర్తులుగా మారారు.

Update: 2023-11-12 13:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిన్న మొన్న‌టి వ‌రకు మిత్రులుగా ఉన్న వారు.. ఇప్పుడు ప్ర‌త్య‌ర్తులుగా మారారు. దీంతో ప్ర‌చారంలో సెగ‌లు పొగ‌లు కక్కుతూ.. వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేస్తూ.. నాయ‌కులు దూసుకుపోతున్నారు. స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌రిపై కోపం.. మ‌రొక‌రికి తంటాలు తెచ్చి పెడుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా జాన‌కీ పురం స‌ర్పంచ్ న‌వ్య పోటీ చేస్తున్నారు.

అయితే.. న‌వ్య పోటీ.. బీఆర్ ఎస్ ఓట్లు చీల్చ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది. దీంతో బీఆర్ ఎస్ టికెట్‌పై పోటీ చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎంక‌డియం శ్రీహ‌రికి చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. త‌న గెలుపును రాసిపెట్టుకోవ‌చ్చని ఆది నుంచిచెబుతున్న శ్రీహ‌రికి ఇప్పుడు న‌వ్య రాజ‌కీయం కొరుకుడుప‌డ‌డం లేదు. ఇక్క‌డ నుంచి 2018లో విజ‌యం ద‌క్కించుకున్న రాజ‌య్య‌.. స‌ర్పంచ్ న‌వ్య‌కు మ‌ధ్య వివాదం ఉన్న విష‌యం తెలిసిందే.

అభివృద్ధి నిధులు ఇవ్వ‌మ‌ని అడిగితే.. త‌న‌ను అస‌భ్యంగా దూషించార‌ని.. లైంగికంగా వేధించారంటూ.. దాదాపు మూడు నెల‌ల పాటు ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర వివాదం సాగింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నియోజ‌క‌వ‌ర్గంలో న‌వ్య రాజ‌కీయం కూడా సాగింది. ఫ‌లితంగా ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో రాజయ్య‌ను ప‌క్క‌న పెట్టిన బీఆర్ ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. ఇక్క‌డి టికెట్‌ను శ్రీహ‌రికి కేటాయించారు. అయితే.. త‌న‌కు టికెట్ ఇవ్వాల‌న్న న‌వ్య విజ్ఞాప‌ను కూడా ఆయ‌న అదే స‌మ‌యంలో ప‌క్క‌న పెట్టారు.

దీంతో స‌ర్పంచ్ పీఠానికి రాజీనామా చేసి మ‌రీ న‌వ్య ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు. కానీ, మొద‌ట్లో ఆమెను లైట్‌తీసుకున్న శ్రీహ‌రి స‌హా బీఆర్ ఎస్ నేత‌ల‌కు రోజులు గ‌డిచే కొద్దీ.. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. న‌వ్య చేస్తున్న‌సింప‌తీరాజ‌కీయం చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఇంటింటికీ తిరుగుతూ.. బీఆర్ ఎస్ త‌న‌కు అన్యాయం చేసింద‌ని.. త‌న‌ను లైంగికంగా వేధించిన వారిపై చ‌ర్య‌లు కూడా తీసుకోలేద‌ని.. త‌న‌ను గెలిపించాల‌ని ఆమె విన్న‌విస్తున్నారు.

ఇది క్షేత్ర‌స్థాయిలో న‌వ్య‌కు సింప‌తీని పెంచుతోంది. దీంతో రాజయ్య‌పై ఉన్న కోపం.. త‌న‌కు సెగ పెడుతోంద‌ని.. శ్రీహ‌రి విల‌విల్లాడుతున్నారు. క‌నీసం 10 వేల ఓట్లు త‌న నుంచి జారిపోయినా.. ఇబ్బందేన‌ని భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News