మెదక్ టికెట్ కోసం ఐదుగురు పోటీ!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంటు స్థానాల్లో గట్టి అభ్యర్థులను నిలపడంపై దృష్టి సారించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంటు స్థానాల్లో గట్టి అభ్యర్థులను నిలపడంపై దృష్టి సారించింది.
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్ లో సీటు కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం అప్పటి నుంచి ఆ తర్వాత జరిగిన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో మెదక్ లోక్ సభా నియోజకవర్గంలో బీఆర్ఎస్సే గెలుపొందింది. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర విజయం సాధించారు. 2009లో ప్రముఖ నటి విజయశాంతి టీఆర్ఎస్ తరపున గెలుపొందారు. ఇక 2014లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ మరోసారి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.
ఇలా వరుసగా ఐదుసార్లు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన మెదక్ లోక్ సభా నియోజకవర్గంపై ఈసారి ఐదుగురు బీఆర్ఎస్ నేతలు కన్నేశారని అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పోటీ చేయడం ఖాయమని.. చివరి నిమిషంలో ఆయన పోటీ చేయకపోతే సీటు దక్కించుకోవాలని పలువురు పోటీ పడుతున్నారు.
వీరిలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ సీటును ఆశిస్తున్నారు. పద్మా దేవేందర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గాలి అనిల్ కుమార్ 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో మెదక్ ఎంపీ బరి నుంచి ఆయన తప్పుకున్నట్టే.
ఈ నేపథ్యంలో మెదక్ బరిలో పోటీ చేస్తే విజయం ఖాయమనే అంచనాలున్న నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొంది. మరి బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి సీటు ఇస్తుందో వేచిచూడాల్సిందే.