ఆడ‌వాళ్ల‌తో త‌న్నిస్తా: ఎమ్మెల్యే రెడ్యా నాయ‌క్‌

ఓ వైపు ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌.. మ‌రోవైపు పార్టీలో అసంతృప్తి.. ఇంకోవైపు మ‌ళ్లీ టికెట్ ద‌క్కుతుందో? లేదో? అనే భ‌యం.. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ద‌రంసోత్ రెడ్యానాయ‌క్ అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి పెట్టారు.

Update: 2023-07-24 10:12 GMT

ఓ వైపు ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌.. మ‌రోవైపు పార్టీలో అసంతృప్తి.. ఇంకోవైపు మ‌ళ్లీ టికెట్ ద‌క్కుతుందో? లేదో? అనే భ‌యం.. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ద‌రంసోత్ రెడ్యానాయ‌క్ అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి పెట్టారు. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు రావ‌డం లేద‌ని ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే.. అందుకు కార‌ణ‌మైన అధికారుల‌ను ఆడ‌వాళ్ల‌తో త‌న్నిస్తా అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియ‌ర్ లీడ‌ర్ రెడ్యా నాయ‌క్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌హబూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ మండ‌లం గొల్ల‌చ‌ర్ల‌లో అన్ని శాఖ‌ల అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, బీఆర్ఎస్ నాయ‌కుల‌తో క‌లిసి స‌మావేశం నిర్వహించారు. ఇందులో భాగంగానే.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు రావ‌డం లేద‌ని ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే, అందుకు కార‌ణ‌మైన అధికారిని ఆడ‌వాళ్ల‌తో త‌న్నిస్తా అంటూ ఎమ్మెల్యే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫ‌కీరా తండాలో నీళ్లు రావ‌డం లేద‌ని తెలిసి మ‌ర‌మ్మ‌తుల‌కు రూ.5 ల‌క్ష‌లు ఇచ్చి 4 నెల‌ల‌వుతోంద‌ని, ఇప్ప‌టికీ ప‌ని పూర్తిచేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఇలాగైతే ప్ర‌జ‌లు త‌న‌కు ఓట్లు ఎలా వేస్తారంటూ కోపం ప్ర‌ద‌ర్శించారు. ఈ నెల 28న‌ డోర్న‌క‌ల్ మండంలో త‌న ప‌ర్య‌ట‌న మొద‌ల‌య్యే నాటికి ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ప్ర‌చారం మొద‌లెట్టిన రెడ్యా నాయ‌క్ ఇప్ప‌టి నుంచే జ‌నాల మ‌ధ్య తిరుగుతున్నారు. అయితే ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌లు ఎదుర‌వుతుండ‌డంతో పోలీస్ బందోబ‌స్తు పెట్టుకుని మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చివ‌రి అవ‌కాశం ఇవ్వాల‌ని.. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని దండం పెట్టి మ‌రీ ఆయ‌న అభ్య‌ర్థిస్తున్నారు. ఈ అయిదేళ్ల‌లో అభివృద్ధి చేస్తే ఇలా అడుక్కోవాల్సిన అవ‌స‌రం ఎమ్మెల్యేకు ఉండేది కాదు క‌దా అని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ఎన్నిక‌లు వ‌స్తుండ‌డంతో ఇప్ప‌డు హ‌డావుడిగా వ‌చ్చి అభివృద్ధి అంటూ అధికారుల‌పై పెత్త‌నం చ‌లాయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News