నాలుగు ఎంపీ సీట్లకు బీఆర్‌ఎస్ అభ్యర్థులు వీరే!
ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్‌ఎస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయినా చెప్పుకోదగ్గ సంఖ్యను సీట్లను సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలో గట్టి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఆర్థిక బలాలు, సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, పార్టీకి విధేయత ఇలా వివిధ అంశాలను బేరీజు వేసుకుని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత పేర్లను ప్రకటించారు.
ఈ మేరకు హైదరాబాద్ లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సమాలోచనలు జరిపారు. వీరి నిర్ణయం ప్రకారం ఏకగీవ్రంగా ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను తాజాగా ప్రకటించారు.
అభ్యర్థుల ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని మండిపడ్డారు. ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం తెల్లం బాలరాజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.
కాగా కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ నిర్వహిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే కాలం మనదేనన్నారు. నేతలు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
ఖమ్మం జిల్లాలో పార్టీ ఓడిపోయిందని ఎవరూ అధైర్యపడొద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ వీడి వెళ్లే నేతలతో బీఆర్‌ఎస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని చెప్పారు. మనమెంత మనకూ గెలుపు, ఓటములు తప్పవన్నారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలయిందన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకతను మనం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.