ఇంతకాలం మహారాష్ట్రలో జోరు చూపించిన కేసీయార్ ఇపుడు తమిళనాడుపై దృష్టిపెట్టారా ? అంటే అవుననే అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తమిళనాడులో ఎంట్రీ ఇవ్వటానికి ప్రముఖ సినీనటుడు విజయ్ దళపతితో కేసీయార్ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. పోయిన ఏడాది మేనెలలో విజయ్ హైదరాబాద్ వచ్చి ప్రగతిభవన్లో కేసీయార్ తో చాలాసేపు సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే తమిళనాడులోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇస్తే తన సహకారం ఉంటుందని విజయ్ హామీ ఇచ్చినట్లు ఇపుడు పార్టీవర్గాలు గుర్తుచేస్తున్నాయి.
తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో హీరో విజయ్ తో కలిసి ఎన్నికలకు వెళితే ఎలాగుంటుందనే విషయాన్ని కేసీయార్ ఆలోచిస్తున్నారట. ఇదే విషయాన్ని విజయ్ తో కూడా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.
దళపతికి కూడా పొలిటికల్ ఎంట్రీపై బాగా ఆసక్తి ఉన్నది. కొంతకాలంగా తాను నటించిన సినిమాల్లో పొలిటికల్ పంచ్ డైలాగులను అదేపనిగా ఉండేట్లుగా చూసుకుంటున్నారు. ప్రతి సినిమాలోను ఎక్కడో ఒకచోట పొలిటికల్ సన్నివేశాలు, డైలాగులు ఉంటున్నాయి.
ఇదంతా పక్కనపెట్టేస్తే తన పేరుతో అభిమానసంఘాలు సమాజసేవలో చాలా బిజీగా ఉంటున్నారు. వేలాది అభిమానసంఘాలున్న ఒకే ఒక్క హీరో బహుశా దళపతేనేమో. రజనీకాంత్ తో సమానంగా విశేషసంఖ్యలో అభిమానులున్నారు. వీళ్ళంతా విజయ్ ను రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుండో ఒత్తిడి చేస్తున్నారు. ఈమధ్యనే తమిళనాడులో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో విజయ్ పేరుతో పోటీచేసిన వారిలో సుమారు 128 మంది సర్పంచులుగా గెలవటం కలకలం రేగింది.
అప్పటినుండి దళపతికి రాజకీయ వాసనలు బాగా ఎక్కువైపోతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా చెన్నై వెళ్ళి విజయ్ తో సమావేశమయ్యారు. బీజేపీలో చేరమని లేదా కమలంపార్టీకి మద్దతుగా నిలవమని అడిగారని తెలుస్తోంది. అయితే దళపతి మాత్రం రెండింటికి నో చెప్పారట. కారణాలు తెలీదు కానీ దళపతికి బీజేపీ అంటే ఎందుకో నచ్చలేదు.
ఈ కామన్ పాయింటే విజయ్ ను కేసీయార్ ను దగ్గరకు చేసిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. మొత్తానికి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దళపతి సహకారంతో బీఆర్ఎస్ తమిళనాడులో ఎంట్రీ ఇవ్వాలని కేసీయార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.