25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నిక‌ చెల్ల‌దా.. హైకోర్టులో పెండింగ్ పిటిష‌న్‌లు

ఇప్ప‌టికే కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే

Update: 2023-08-01 10:08 GMT

తెలంగాణ‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల ఎన్నిక చెల్ల‌దంటూ గ‌తంలో దాఖ‌లైన పిటిష‌న్‌లు ఆ పార్టీకి గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక ర‌ద్దు చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్లు విచారిస్తామ‌ని కూడా తెలంగాణ హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

ఈ నేప‌థ్యంలో అస‌లు తెలంగాణ హైకోర్టులో ఎంత‌మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హత విధించాల‌ని దాఖలు చేసిన పిటిష‌న్‌లు ఉన్నాయ‌నే లెక్క ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం హైకోర్టులో ఇలాంటివి 30కు పైగా పెండింగ్ పిటిష‌న్‌లు ఉన్నాయి. ఇందులో 25కు పైగా అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ 25 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్ల‌దంటూ దాఖ‌లైన‌వే ఈ పిటిష‌న్‌ల‌న్నీ. 2018 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈ పిటిష‌న్‌లు వేశారు.

ఇందులో శ్రీనివాస్ గౌడ్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్‌, చెన్న‌మ‌నేని ర‌మేష్‌, మ‌ర్రి జ‌నార్ధ‌న్‌, ముత్తిరెడ్డి, గూడెం మ‌హిపాల్ రెడ్డితో పాటు మ‌రికొంద‌రిపైనా ఈ ఎన్నిక‌ల పిటిష‌న్‌లు దాఖ‌ల‌య్యాయి. ఇప్ప‌టికే వీటిలో కొన్నింటిపై విచార‌ణ మొద‌లైంది. వ‌న‌మా కేసులో తీర్పు కూడా వెల్ల‌డైంది. ఇక ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్ల‌దంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ ప్రారంభ‌మైంది. అలాగే గంగుల క‌మ‌లాక‌ర్‌పై దాఖ‌లైన ఎన్నిక‌ల పిటిష‌న్‌లో ఆగ‌స్టు 12 నుంచి 17 వ‌ర‌కు క్రాస్ ఎగ్జామినేష‌న్ చేయాల‌ని రిటైర్డ్ జ‌డ్జి శైల‌జ క‌మిష‌న్‌ను హైకోర్టు ఆదేశించింది. మ‌రి ఈ పిటిష‌న్‌లు విచార‌ణ ముగిసి ఎవ‌రిపై ఎప్పుడు వేటు ప‌డుతుందో తెలియ‌క నేత‌లు టెన్ష‌న్‌లో ఉన్నారు.

Tags:    

Similar News