ఈ 29 ఏళ్ల యువతి సీతక్కను ఓడించగలరా?

సీతక్క.. పరిచయం అక్కర్లేని పేరు. మాజీ మావోయిస్టుగా, గిరిజన ప్రతినిధిగా ఆమెకు ఎంతో గుర్తింపు ఉంది

Update: 2023-08-22 06:36 GMT

సీతక్క.. పరిచయం అక్కర్లేని పేరు. మాజీ మావోయిస్టుగా, గిరిజన ప్రతినిధిగా ఆమెకు ఎంతో గుర్తింపు ఉంది. మరోవైపు ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గమైన ములుగు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. కరోనా సమయంలో, గోదావరి వరదలప్పుడు సీతక్క ఆ కొండ కోనల్లో, కాలి బాటలు కూడా లేని దారుల్లో ప్రజలకు విశేష సేవలు అందించారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సీతక్క వచ్చే ఎన్నికల్లోనూ ములుగు నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ మేరకు ఆమెకు దాదాపు సీటు ఖాయమైనట్టే.

కాగా మరోవైపు ములుగులో సీతక్కపై పోటీకి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో ఎస్టీ మహిళనే బరిలోకి దింపారు. ప్రస్తుతం ములుగు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గా ఉన్న బడే నాగజ్యోతిని బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖరారు చేశారు. కేసీఆర్‌ టికెట్లు ప్రకటిస్తున్నప్పుడు తన ఇంట్లో నాగజ్యోతి ఉద్వేగం తట్టుకోలేక ఏడ్చేశారు.

అయితే సీతక్కను ఓడించడం చాలా కష్టమనే విషయం కేసీఆర్‌ కు తెలుసు. ఎందుకంటే ములుగులో సీతక్క చేసిన సేవలు అటువంటివి. ఇప్పటివరకు ప్రభుత్వం, అధికారులు కూడా వెళ్లలేని కుగ్రామాలకు సైతం సీతక్క వెళ్లగలరు. మావోయిస్టు ఉద్యమంలో ఆమె పనిచేసి ఉండటంతో అడవిలో ప్రతి బాట, దారి ఆమెకు అవగతమే.

ఈ క్రమంలోనే గోదావరి వరదలు ములుగు నియోజకవర్గంలో గ్రామాలను చుట్టుముట్టినప్పుడు, ప్రజలు విష జ్వరాల బారినపడ్డప్పుడు, కరోనా సమయంలోనూ సీతక్క విశేష సేవలు అందించారు. స్వయంగా నిత్యావసర వస్తువులను తన తలపై పెట్టుకుని నడుచుకుంటూ మోసుకుపోయారు. అలాగే నిండు గోదావరిలో పడవపై ఎలాంటి బెరుకు, భయం లేకుండా ప్రయాణించి ప్రజలకు అండగా నిలిచారు.

ఈ నేపథ్యంలో మరోమారు సీతక్క విజయం ఖాయంగానే కనిపిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా సీతక్కను ఓడించడానికి కేసీఆర్‌ చాలా పెద్ద ఎత్తునే కసరత్తు చేశారు. చందూలాల్‌ లాంటి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ చివరకు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బడే నాగజ్యోతిని అభ్యర్థిగా ప్రకటించారు.

కాగా నాగ జ్యోతిది కూడా మావోయిస్టు కుటుంబమే. పోలీసుల ఎన్‌ కౌంటర్‌ లో మరణించిన నాగేశ్వర్‌ రావు అలియాస్‌ ప్రభాకర్‌ కుమార్తె ఆమె. నాగజ్యోతి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ బోటనీ, బీఈడీ చదివారు. 2019 లో తొలిసారి సర్పంచ్‌ పదవికి పోటీ చేసి ఆమె గెలిచారు. తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి తాడ్వాయి నుంచి ఆ పార్టీ తరఫున జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఇదే క్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ గా బాధ్యతలు చేపట్టారు. నాగ జ్యోతి వయసు కేవలం 29 ఏళ్లే.

2004 నుంచి రాజకీయాల్లో ఉంటూ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్కను నాగజ్యోతి ఓడించగలరా, లేదా అనేది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News