కీలక ఎంపీ స్థానం కోసం బీఆర్‌ఎస్‌ లో మూడు ముక్కలాట!

ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

Update: 2024-01-27 23:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ చేతిలో బీఆర్‌ఎస్‌ చిత్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

ముఖ్యంగా కీలక నియోజకవర్గాల్లో ఒకటైన నిజామాబాద్‌ ఎంపీ స్థానం కోసం బీఆర్‌ఎస్‌ లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్‌ నుంచి 2004, 2009ల్లో కాంగ్రెస్‌ తరఫున మధుయాష్కీ గౌడ్‌ పోటీ చేసి విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. తిరిగి 2019లో పోటీ చేసిన కవితకు చుక్కెదురు అయ్యింది. బీజేపీ తరఫున పోటీ చేసిన మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ కుమారుడు ధర్మపురి అర్వింద్‌ చేతిలో కవిత ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం కవిత ఎంఎల్‌సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె నిజామాబాద్‌ నుంచి పోటీ చేయబోరని అంటున్నారు. ఓటమి భయంతో ఆమె బీఆర్‌ఎస్‌ కంచుకోట అయిన మెదక్‌ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగుతారని టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ ఎంపీ స్థానంపై ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కన్నేశారని అంటున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయినవారే కావడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్థన్‌ నిజామాబాద్‌ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి పోటీ పడుతున్నారని అంటున్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున రెండుసార్లు గెలుపొందిన బిగాల గణేశ్‌ గుప్తా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఏకంగా మూడో స్థానంలో నిలిచారు.

ఇక నిజామాబాద్‌ రూరల్‌ లో బీఆర్‌ఎస్‌ తరఫున రెండుసార్లు విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్థన్‌ మూడోసారి 2023 ఎన్నికల్లో చిత్తయ్యారు.

ఈ నేపథ్యంలో బిగాల, బాజిరెడ్డి ఇద్దరూ నిజామాబాద్‌ ఎంపీ స్థానంపై కన్నేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినవారికి బీఆర్‌ఎస్‌ అధిష్టానం సీట్లు ఇవ్వకపోతే వీరు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో గణేశ్‌ గుప్తా తన సోదరుడు మహేశ్‌ ను నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేయించడానికి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇక బీజేపీ తరఫున ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ లేదా మరో కొత్త అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది.


Tags:    

Similar News