కూటమిలో లుకలుకలే రఘవర్మకు శాపమా?
ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న లుకలుకలు.. కలివిడి తనం లేకపోవడం.. వంటివి ఉత్తరాంధ్రలో కూటమి పార్టీలకు శాపంగా మారిందా? అందుకే.;
ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉన్న లుకలుకలు.. కలివిడి తనం లేకపోవడం.. వంటివి ఉత్తరాంధ్రలో కూటమి పార్టీలకు శాపంగా మారిందా? అందుకే.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున బలమైన మద్దతు కూడగట్టినా.. పాకాలపాటి రఘువర్మ పరాజయం పాలయ్యారా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. నిజానికి ఇక్కడ కూటమి తరఫున .. రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు పదిహేను రోజుల ముందుగానే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. దీనికిపై ప్రత్యేకంగా జనసేన, టీడీపీ నాయకులతో కూడిన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వంటివారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. కానీ, జనసేన నుంచి ఒకరు కూడా ఈ ప్రచారంలో పాల్గొనకపోవడం గమనార్హం. అదేసమయంలో కూటమి తీసుకున్న నిర్ణయానికి వ్యతి రేకంగా.. బీజేపీ అడుగులు వేసింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి అసలు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ పోరును పట్టించుకో లేదు. పైగా.. స్థానిక నేతలు యాంటీ లైన్ తీసుకున్నారని.. రఘువర్మకు ప్రత్యర్థిగా ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ నేత లు మద్దతు ప్రకటించారని తెలిసి కూడా.. పురందేశ్వరి మౌనం పాటించారు. ఈ ప్రభావం జోరుగా కనిపించింది.
పైగా.. కూటమిలో కేవలం టీడీపీ నాయకులు మాత్రమే రఘువర్మకు మద్దతు ప్రకటించగా.. జనసేన పట్టించుకోకపోవడం.. పై నుంచి పవన్ కల్యాణ్ ఆదేశాలు ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకులు గాదెకు మద్దతు ప్రకటించడం వంటివి.. కూటమిలో ఏర్పడిన లోపాలను ఎత్తి చూపుతోంది. ఇక, క్షేత్రస్థాయి కమల నాథులు కూడా.. గాదెకు మద్దతుగా బహిరంగ ప్రకటనలే చేశారు. ఈ పరిణామాలు కూటమి తరఫున పోటీ చేసిన రఘువర్మకు శాపంగా మారాయి. అయితే.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు తనవెంటే ఉన్నారని.. ప్రభుత్వం ఉపాధ్యాయులకు మేలు చేస్తోందని ఆయన చెప్పినప్పటికీ ఫలితం కనిపించలేదు.
ఏదేమైనా ఉత్తరాంధ్ర ఫలితం తర్వాత.. కూటమి నాయకులు చర్చించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వైసీపీ మద్దతు ఇస్తామన్నా.. గాదె శ్రీనివాసులు తిరస్కరించారు. అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతా! అంటూ.. ఆయన మౌనంగా తిరస్కరించడం గమనార్హం. ఒకవేళ వైసీపీ మద్దతు కనుక ఇచ్చి ఉంటే.. ఉమ్మడి కృష్నా.. గుంటూరు జిల్లాల్లో ఏర్పడిన పరాభవం ఇక్కడ కూడా ఎదురయ్యేదని గాదె వర్గీయులు చెబుతున్నారు.