ఇదేం రౌడీయిజం? కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దారుణ దాడి
అందరూ పట్టణానికి చెందిన వారే అయినప్పుడు వారిని వెంటనే అదుపులోకి తీసుకోకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
బరితెగింపు సైతం బెదిరేలా వ్యవహరించిన తీరు కావలి పట్టణంలో చోటు చేసుకుంది. తామేం చేసినా నడిచిపోతుందన్న బలుపుతో వ్యవహరించిన కొందరి తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారిని షాక్ కు గురి చేసింది. తప్పు చేసింది కాకుండా రౌడీయిజం ప్రదర్శించటం ఒక ఎత్తు అయితే.. తమను ఎవరేం చేయలేరన్న అహంకారంతో మదమెక్కిన కొందరు ఆర్టీసీ డ్రైవర్ ను అత్యంత అమానుషంగా దాడి చేసిన వైనం.. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారటమే కాదు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుంటే ఏపీ మరో బిహార్ గా మారుతుందన్న మాట పలువురి నోట వినిపించింది.
ఇంతకూ జరిగిందేమంటే.. శుక్రవారం బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీ16 జెడ్0702 సూపర్ లగ్జరీ బస్సు కావలి మీదుగా వస్తోంది. కావలిలోని ట్రంక్ రోడ్డులో బస్సు వెళుతున్న వేళలో.. తన వాహనం ముందున్న టూవీలర్ వాహనాన్ని పక్కకు తీయాలంటూ బస్సు డ్రైవర్ రాంసింగ్ హారన్ మోగించాడు. దీంతో.. ఆ టూవీలర్ వ్యక్తి బస్సు డ్రైవర్ తో వాదనకు దిగాడు. అక్కడున్న పోలీసులు వారికి సర్ది చెప్పి పంపేశారు. ఈ విషయాన్ని వాహనదారుడు తన మిత్రులకు చెప్పటంతో.. పద్నాలుగు మందితో కూడిన టీం ఒకటి బస్సును వెంబడించారు.
కావలి పట్టణ శివారులో బస్సును ఆపారు. డ్రైవర్ ను కిందకు దింపి.. ఇష్టారాజ్యంగా తిట్టారు. అక్కడితో ఆగకుండా దారుణంగా కొట్టారు. కింద పడిన డ్రైవర్ ను అత్యంత బలంగా కడుపులో అదే పనిగా ఎగిరెగిరి కాలితో కొట్టటం షాకింగ్ గా మారింది. అడ్డుకున్న కండక్టర్ ను సైతం చితకబాదారు. ఈ ఉదంతాన్ని బస్సులోని ప్రయాణికుడు తన సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా.. అతడి మీదా దాడికి పాల్పడి సెల్ ఫోన్ ను ధ్వంసం చేశారు.
దాడి సమాచారాన్ని అందుకున్ సీఐ అక్కడకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా పోలీసు చెప్పటం గమనార్హం. అందరూ పట్టణానికి చెందిన వారే అయినప్పుడు వారిని వెంటనే అదుపులోకి తీసుకోకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ దాడికి చెందిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.
ఏపీలో పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉన్నాయా? అన్న సందేహాలు కలిగేలా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలు చూసిన వారంతా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే ఎందుకు స్పందించటం లేదన్న విమర్శలు పెరిగాయి. ఇలాంటి వేళ.. స్పందించిన ఆర్టీసీ ఛైర్మన్ స్పందిస్తూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల దౌర్జన్యం చేస్తే.. తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనికి ముందు.. ఇలాంటి ఉదంతం ఏపీలో మరెక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మరి.. నిందితుల్ని ఎంత వేగంగా అదుపులోకి తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.