జమిలి ఎన్నికలు జరగాలంటే అక్కడే మెలిక ఉందిట !
బీజేపీ జమిలి ఎన్నికల బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టడానికే నానా యాగీ విపక్షాలు చేశాయి.
జమిలి ఎన్నికల మీద చాలా స్పీడ్ గా ఉంది బీజేపీ. అయితే బీజేపీ జోరుకు స్పీడ్ బ్రేకులు ఎన్నో పడుతున్నాయి. అనుకున్నవి అన్నీ ఇట్టే జరిగిపోవు కదా. బీజేపీ జమిలి ఎన్నికల బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టడానికే నానా యాగీ విపక్షాలు చేశాయి. దానికి కూడా చివరికి ఓటింగుని తీసుకోవాల్సి వచ్చింది.
మొత్తానికి జమిలి బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టినా చాలినంత బలం లేదని గ్రహించి రాజకీయ తెలివిడితో బీజేపీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. ఆ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి జమిలి బండి ముందుకు కదులుతుంది. ఇదిలా ఉంటే బీజేపీ తలచుకుంటే జమిలి ఎన్నికలు జరిగి తీరాల్సిందే అంటున్నారు.
అయితే అవి కాస్తా ఆలస్యం అయితే కావచ్చు అంటున్నారు. అయితే ఎన్డీయేలో బీజేపీ తరువాత రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ కూడా జమిలి ఎన్నికలకు జై కొట్టింది. కానీ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం జమిలి జరగాలంటే చాలా ఉంది అంటున్నారు ముఖ్యంగా ముందు రాష్ట్రాల ఆమోదం కావాలని అర్ధం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశం అవుతున్నాయి. రాష్ట్రాలు అనుమతించకుండా జమిలి ఎన్నికలు జరగవని కూడా ఆయన తేల్చేస్తున్నారు.
అయితే గోరంట్ల చెప్పిన దాంటో వాస్తవం ఉంది. రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉండడంతో పార్లమెంట్ లో మూడింట రెండు వంతుల ఎంపీల బలం అవసరం. కానీ బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అవసరం అయితే ఉభయసభలను కూడా సమావేశపరచి రెండింతల ఎంపీల మద్దతు కూడగట్టవచ్చు అని అంటున్నారు.
ఆ తరువాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పిన మేరకు సగానికి సగం రాష్ట్రాలలో బిల్లు పాస్ కావాలి. ఇపుడు దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కానీ చూస్తే 19 దాకా ఉన్నాయి. అంటే 14 రాష్ట్రాలలో అనుమతి తీసుకుంటే చాలు జమిలి బిల్లు పాస్ అవుతుంది. మరి బీజేపీకి ఏ విధంగా చూసినా అడ్డంకి అయితే లేనే లేదు అని అంటున్నారు
అయితే ఆలూ లేదూ చూలూ లేదు ఇపుడు ఈ డిస్కషన్ ఎందుకు అన్నది ఉంది. కానీ టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అందుకే ఆయన ఈ సమయంలో ఈ చర్చకు పెట్టారు అని అంటున్నారు. టీడీపీ అయితే ముందు జమిలి బిల్లు ఎంత దూరం వెళ్తుందో చూడాలని అనుకుంటోంది. అందుకే సై అని మద్దతు ఇస్తోంది. అలా లౌక్యంగా అధినాయకత్వం ఉన్న వేళ బీజేపీ ఎంతగానో ఇష్టపడే జమిలి ఎన్నికలకు సంబంధించి అబ్బే అసలు కుదరదన్నట్లుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు అయితే కూటమి లోపలా వెలుపలా కూడా చర్చకు తావిస్తున్నాయి అంటున్నారు.