బుద్ధి మారని కెనడా.. భారత్‌ పై మరోసారి తప్పుడు ఆరోపణలు!

మరోవైపు కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల నిఘా సంస్థ.. కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ సంచలన ఆరోపణలు చేసింది.

Update: 2024-02-05 07:42 GMT

భారత్‌ వ్యతిరేక శక్తులకు అడ్డాగా నిలుస్తూ.. వారికి ఊతమిస్తూ.. వారిని వెనకేసుకొస్తున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నారు. ఇప్పటికే ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ ట్రూడో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమ మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, తదితర దేశాలకు భారత్‌ పై ఫిర్యాదు చేశారు. తమ విచారణకు భారత్‌ సహకరించాలని డిమాండ్‌ చేశారు. హరదీప్‌ సింగ్‌ వ్యవహారంలో భారత్‌ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కెనడాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి గెలుపొందడానికి.. ఆ దేశంలో పెద్ద ఎత్తున ఉన్న సిక్కుల్ని ఆకట్టుకోవడానికే భారత్‌ పై కెనడా ప్రధాని విద్వేషం చిమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి నిదర్శనంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.

భారత్‌ పై కారాలు మిరియాలు నూరుతున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కెనడాకు భారత్‌ నుంచి ‘విదేశీ ముప్పు‘ ఉందని ప్రచారం చేయనున్నారు. ‘భారత్‌ తో విదేశీ ముప్పు’ నినాదంతో జస్టిన్‌ ట్రూడో ఎన్నికల ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.

మరోవైపు కెనడా ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేసుకున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల నిఘా సంస్థ.. కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ సంచలన ఆరోపణలు చేసింది. భారత్‌ తో కెనడాకు ముప్పు పొంచి ఉందని కూడా తప్పుడు ఆరోపణలు చేసింది. గతేడాది విడుదలైన ఈ నివేదిక వివరాలను స్థానిక మీడియా తొలిసారిగా బయటకు వెల్లడించడం గమనార్హం. అయితే ఒక్క మనదేశాన్ని కాకుండా చైనా, రష్యాలపైన కూడా కెనడా ఇవే ఆరోపణలు చేసింది. అయితే కెనడా నిఘా నివేదికలో భారతదేశం పేరును నేరుగా ప్రస్తావించడం ఇదే తొలిసారి కావడంతో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తమ దేశ రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో భారత్‌ జోక్యాన్ని అడ్డుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని కెనడా నిఘా సంస్థ నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ నివేదిక ఆధారంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో లోతైన విచారణకు ఆదేశాలు ఇచ్చారు.

అలాగే కెనడాలో చైనా జోక్యంపైన కూడా నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేశాయి. చైనాను కెనడాకు అతి పెద్ద విదేశీ ముప్పుగా అభివర్ణించడం గమనార్హం. ఈ క్రమంలో కెనడాలోని అన్ని రంగాలు, అన్ని స్థాయిల్లో చైనా జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని నిఘా నివేదిక బాంబుపేల్చింది. ఈ నివేదికలో భారత్‌ తో పాటూ చైనా పేరును కెనడా నేరుగా ప్రస్తావించడం గమనార్హం. కాగా కెనడా తాజా ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

Tags:    

Similar News