సీబీఐ పంజా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు

తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే తీవ్ర చర్చనీయాంశం అయిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-09-20 07:23 GMT

తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే తీవ్ర చర్చనీయాంశం అయిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. ఓ దశలో గత ప్రభుత్వ పెద్దలు, కీలక వ్యక్తుల మెడకు చుట్టుకునేలా కనిపించిన ఈ ఉదంతంలో మధ్యలో కొన్నాళ్లుగా స్తబ్ధత కనిపించింది. అయితే, అనూహ్యంగా ఓ పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు దొరికిన ఈ అవకాశాన్ని కాంగ్రెస్ సర్కారు చాలా జాగ్రత్తగా వాడుతోంది.

ఏ1, ఏ6 ఎక్కడ..?

బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నాయకులను అడ్డుకునేందుకు, వారి ఎత్తుగడలను ఎక్కడికక్కడ చిత్తు చేసేందుకు ఫోన్ లను ట్యాప్ చేసిందనే ఆరోపణలున్నాయి. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి ఉంటే ఏమయ్యేదో కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితి అంతా మారిపోయింది. ఇక ఈ కేసులో అక్యూజ్జ్ (ఏ-1)గా ప్రభాకర్ రావు, అక్యూజ్జ్ (ఏ-6)గా శ్రవణ్ ‌రావు ఉన్నారు. వీరిద్దరిపై తాజాగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్‌ కు సీబీఐ లేఖ రాసింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు చేసిన విజ్ఞప్తిని సీబీఐ అంగీకరించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌ ‌రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి.

అమెరికాలో ఉంటూ..

ట్యాపింగ్ కేసులో మొదటి నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత ఈయన అమెరికాకు వెళ్లిపోయారు. పలు అనారోగ్య కారణాలను చూపుతున్నారు. ప్రభాకర్ రావును భారత్ కు రప్పించేందుకు సీఐడీ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం ముందుగా ఆయన‌కు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. మరోవైపు ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఆయన

వర్చువల్‌ గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది. ఇక శ్రవణ్ రావు కూడా అమెరికాలోనే ఉన్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయాన్ని సీబీఐకి సీఐడీ అధికారులు తెలిపారు. సీబీఐ నుంచి ఇంటర్ పోల్‌కి సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రభాకర్ రావును రప్పించేందుకు సీఐడీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయన్ను హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆరోగ్యం బాగోలేనందున హాజరు కాలేనని సిట్‌కు ప్రభాకర్ రావు తెలిపారు.

ఇంటర్ పోల్ ద్వారా ప్రయత్నం..

సాధారణ ప్రయత్నాల ద్వారా కాకుండా.. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావును హైదరాబాద్‌ రప్పించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. అందుకే ఎ-6గా ఉన్న శ్రవణ్ రావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. శ్రవణ్ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. త్వరలోనే వీరిద్దరినీ హైదరాబాద్ రప్పిస్తామని సిట్ పేర్కొంటోంది. ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News