20 ఏళ్లుగా పరారీలో ఉన్నోడ్ని పట్టేసిన సీబీఐ
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఏళ్లు. రెండు దశాబ్దాలుగా తప్పించుకొని తిరుగుతున్న ఒక ఘరానా మోసగాడ్ని పట్టేసింది సీబీఐ.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఏళ్లు. రెండు దశాబ్దాలుగా తప్పించుకొని తిరుగుతున్న ఒక ఘరానా మోసగాడ్ని పట్టేసింది సీబీఐ. ఊరు మార్చి..పేరు మార్చుకొని.. చివరకు విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్న నిందితుడ్ని వెంటాడి వేటాడి మరీ పట్టేసింది. ఇంతకూ అతడెవరు? అతను చేసిన మోసం ఏమిటి? ఇన్నేళ్ల తర్వాత సీబీఐ అతన్ని ఎలా పట్టేసిందన్న వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని చందులాల్ బారాదరీ ఎస్ బీఐ బ్రాంచ్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే చలపతిరావు అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో రూ.50 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని ఎగ్గొట్టేశాడు. దీంతో 2004లోహైదరాబాద్ సీబీఐ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. లోన్ తీసుకున్న చలపతిరావు అప్పటి నుంచి కనిపించటం మానేశాడు. తమిళనాడులోని సేలంకు వెళ్లిన అతను వినీత్ కుమార్ అంటూ పేరు మార్చుకున్నాడు. 2007లో మరో పెళ్లి కూడా చేసుకున్నాడు.
మొదటి భార్య కొడుకును సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సీబీఐ గుర్తించింది. అదే సమయంలో తనను సీబీఐ గుర్తించిందని అర్థం చేసుకున్న చలపతిరావు 2014లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు వెళ్లిపోయాడు. అక్కడ లోన్ రికవరీ ఏజెంట్ గా మారాడు. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడి నుంచి ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ కు షిఫ్టు అయి టీచర్ గా పని చేశాడు. 2016లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ విదితాత్మానందతీర్థగా మారాడు.
అక్కడ కూడా తన దొంగ బుద్ధి పోనిచ్చుకోని అతను ఆశ్రమాన్ని మోసం చేసి రూ.70 లక్షలు కాజేశాడు. అనంతరం రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చేరుకున్న అతను తన తదుపరి గమ్యస్థానంగా తమిళనాడు.. అక్కడి నుంచి శ్రీలంకకు పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అతడ్ని.. అతడి మోసాల్ని ట్రాక్ చేస్తున్న సీబీఐ.. అతన్ని గుర్తించారు. రెండు దశాబ్దాల అనంతరం అతన్ని ఈ ఆదివారం తిరునల్వేలి సమీపంలో అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ కు తీసుుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా అతనికి రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇలా.. అదే పనిగా తప్పించుకొని తిరుగుతున్న మోసగాడ్ని సీబీఐ ఎట్టకేలకు పట్టేసింది.