ఏమిటీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు... వ్యూహాత్మకంగా సీఐడీ అడుగులు?

అవును... స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న బాబుకు మరో షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ!

Update: 2023-09-11 12:55 GMT

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 22 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌస్ అరెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సంగతి అలా ఉంటే... ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ చంద్రబాబు విషయంలో చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న బాబుకు మరో షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ! ఇండులో భాగంగా... అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది. గత ఏడాది మే లో నమోదైన ఈ కేసులో చంద్రబాబును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేసింది.

దీంతో... ఒకవేళ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో అరెస్టు చేసేందుకు సిఐడీ సిద్ధమవుతోన్నట్లుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేవలం కాగితాలకే పరిమితం చేసి "అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌" ప్రాజెక్ట్‌ పేరుతో దోపిడీ చేశారని 2022లో ప్రభుత్వం సీఐడీ విచారణ ఆదేశించింది. అలైన్‌ మెంట్‌ ను నచ్చినట్టు మార్చేశారని.. ఫలితంగా వేల కోట్ల రూపాయలు అనుయాయలకు దోచి పెట్టారనేది అభియోగం!

వాస్తవానికి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేశారంటూ ఫిర్యాదు అందింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ మేరకు గత ఏడాది మే నెలలో ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ అలైన్ మెంట్ లో చేసిన మార్పులు... రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ కు లబ్ది కలిగించేలా మార్పులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఏ1 గా చంద్రబాబుని, ఏ2 గా మాజీ మంత్రి నారాయణను చేర్చిన సీఐడీ... వీరితో పాటు మరికొందరి పేర్లను కూడా చేర్చింది.

ఇందులో భాగంగా... సెక్షన్ 420, 166, 34, 26, 37, 120 బీ కింద ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబును ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా విచారణకు అనుమతి ఇవ్వాలని తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది!

Tags:    

Similar News