సునీల్ కనుగోలుకు ఫోన్ చేసిన చంద్రబాబు...!

దీంతో ఏపీలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చూపు సునీల్ కనుగోలు మీద పడింది అని అంటున్నారు.

Update: 2023-12-05 11:30 GMT

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం రావడం వెనక ఎందరితో కృషి ఉంది. అలాగే కాంగ్రెస్ సమిష్టిగా పనిచేసింది. వీటన్నిటికీ తెర వెనక వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు చేసిన పక్కా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా సునిల్ కనుగోలు ఉన్నారు. ఆయన పేరు కూడా ఇపుడు అంతే స్థాయిలో మారు మోగుతోంది. సునీల్ కనుగోలు పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ కి ప్రధమ శిష్యుడు. గురువు పొలిటికల్ కన్సల్టెన్సీలో అప్పట్లో శిష్యుడికీ వాటా ఉంది.

అలా విజయాలతో ప్రశాంత్ కిశోర్ ఉంటే సునీల్ కనుగోలు కూడా తరువాత కాలంలో సొంతంగా కన్సల్టెంట్ అవతారం ఎత్తారు. ఆయన కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించి అక్కడ పార్టీని గెలిపించారు. ఇపుడు తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేసి హస్తానికి రాచబాట పరచారు.

దాంతో ఆయన్ని పెట్టుకుంటే ఎవరైనా సూపర్ హిట్టు అన్న మాట మారు మోగుతోంది. దీంతో ఏపీలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చూపు సునీల్ కనుగోలు మీద పడింది అని అంటున్నారు. ఏపీలో ఇప్పటికే టీడీపీకి రాబిన్ శర్మ సేవలు అందిస్తున్నారు.

అయితే ఆయన వ్యూహాలు అంతగా పారడంలేదు అని అంటున్నారు. టీడీపీ విపక్షంలో ఉన్నా దూకుడు అయితే చేయడంలేదు అని అంటున్నారు. దాంతో ఇపుడు సునీల్ కనుగోలు ని పెట్టుకుంటే డ్యాం ష్యూర్ గా విక్టరీ ఖాయమని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దాంతోనే సునీల్ కనుగోలుకు చంద్రబాబు ఫోన్ చేసి మంతనాలు జరిపారన్న టాక్ అయితే ఇపుడు పెద్ద ఎత్తున ఉంది.

ఈ మేరకు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. చంద్రబాబు రాజకీయ చాణక్యుడే. 2019 ఎన్నికల నాటికి ఆయనే వ్యూహాలు సొంతంగా వేసుకుంటూ వెళ్లారు. కానీ అవి పీకే ముందు పారలేదు. అప్పటికే వైసీపీకి పీకే ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తూ ఉన్నారు. పీకేని వైసీపీ తీసుకున్నపుడు టీడీపీ నేతలు మాకు బాబు కంటే ఎవరూ అవసరం లేదని అంటూ వచ్చారు.

కానీ కాలం మారింది. స్మార్ట్ యుగం నడుస్తోంది. సోషల్ మీడియాదే పై చేయిగా ఉంది. ఒకేసారి కోట్లాది బుర్రలలోకి దూరి కొత్త ఆలోచన ప్రవేశపెట్టాలంటే దానికంటూ ప్రత్యేకమైన వ్యూహకర్త ఉండాలి. ఎప్పటికపుడు పరిస్థితులకు తగిన విధంగా వ్యూహ రచన చేయగల వారు అవసరం. రాజకీయాల్లో ఉన్న వారికి ఎన్నో పనులు ఉంటాయి. నాయకత్వ బాధ్యతలతో వారు తలమునకలు అవుతూ ఉంటారు.

దాంతో తప్పనిసరిగా వ్యూహకర్తలు అవసరం అయితే ఉంది. అందుకే చంద్రబాబు రాబిన్ శర్మను తీసుకున్నారు. ఆయన ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ ఒక ప్రోగ్రాం ఇచ్చారు. అది ఒక మాదిరిగానే జనంలోకి వెళ్లింది. అలాగే బాదుడే బాదుడు అని మరో ప్రోగ్రాం ఇచ్చినా అది కూడా అంతంతమాత్రంగానే వెళ్ళింది.

ఆ తరువాత మాత్రం ఆయన నుంచి వచ్చే వ్యూహాల మీద టీడీపీ నేతలకు నమ్మకం తగ్గింది అని అంటున్నారు. ఏపీలో వైసీపీని ఢీ కొట్టాలంటే పదునైన వ్యూహాలు అవసరం. టైం చూస్తే తక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో సునీల్ కనుగోలు మీద టీడీపీ ఫుల్ ఫోకస్ పెట్టేసింది అని అంటున్నారు.

మరి బాబు నిజంగా మాట్లాడారా మాట్లాడితే ఏమి చర్చలు జరిగి ఉంటాయి అన్నది ఇపుడు అందరి బుర్రలను దొలిచేస్తోంది. తెలంగాణా ఎన్నికల తరువాత సునీల్ కనుగోలు కాంగ్రెస్ కే కట్టుబడి లోక్ సభ ఎన్నికలు అటు కర్నాటక ఇటు తెలంగాణా కూడా చూస్తారు అని వార్తలు వస్తున్నాయి. అంటే ఆయన ఇంకా చాలా చేయాల్సి ఉంది అని అంటున్నారు.

మరి ఈ కీలకమైన సమయంలో ఆయన ఏపీకి వచ్చి తెలుగుదేశానికి పనిచేస్తారా అన్నది ఒక సందేహం. అయితే పొలిటికల్ కన్సల్టెన్సీ తీసుకున్న వారికి ఇవన్నీ మామూలే. ఒకేసారి వేరు వేరు రాష్ట్రాలలో కూడా తమ టీం ని పెట్టి పనిచేయించగలరు. అందువల్ల చంద్రబాబు ఫోన్ కి సునీల్ కనుగోలు ఓకే అంటూ చెబితే మాత్రం వచ్చే ఎన్నికల్లో పెను సవాల్ తప్పదనే అంటున్నారు. ఎందుకంటే ఏపీలో వైసీపీకి పీకే టీం పనిచేస్తోంది. అలా అటూ ఇటూ పీకే శిధ్య బృందాలే ఎన్నికలను నడిపిస్తే విజేత ఎవరు అన్నది కడు ఆసక్తికరంగా ఉంటుంది అంటున్నారు.

Tags:    

Similar News