ఢిల్లీలోనే బాబు పవన్...టెన్షన్ పెడుతున్న బీజేపీ...!
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మరోసారి భేటీ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రోజంతా ఢిల్లీలో ఉన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మరోసారి భేటీ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రోజంతా ఢిల్లీలో ఉన్నారు. అయితే అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిజీగా ఉండడంతో ఈ భేటీ వాయిదా పడింది. శనివారం భేటీ ఉండవచ్చు అని అంటున్నారు.
ఇక చూస్తే గురువారం రాత్రి పొద్దు పోయిన తరువాత అమిత్ షాతో బాబు పవన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. బాబుకు కొన్ని ప్రతిపాదనలు ఏపీ బీజేపీ తరఫున అమిత్ షా చేశారు. కనీసంగా ఎనిమిది ఎంపీ సీట్లకు తగ్గకుండా ఉంటేనే పొత్తు అన్నట్లుగా చెప్పి బంతిని బాబు కోర్టులో వేశారు.
దాంతో పాటు విశాఖ విజయవాడ, హిందూపూర్ వంటి కీలక ఎంపీ సీట్లకు కూడా పట్టుబట్టారు. రెండవ ఆలోచన లేదు అన్నట్లుగా బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా తెలిసింది. అన్నీ ఆలోచించుకుని రావాలని కోరినట్లుగా ప్రచారం సాగింది. దాంతో ఏ విషయం ఈ భేటీలో తేలకపోవడం వల్లనే శుక్రవారం రోజంతా బాబు ఢిల్లీలో ఉన్నా మీడియాతో మాట్లాడలేదని అంటున్నారు.
ఈ మధ్యలో ఏపీ బీజేపీ నేతలను బీజేపీ కేంద్ర పెద్దలు పిలిపించుకుని టీడీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు తాము చేసిన ప్రతిపాదనలు కూడా చెప్పి వారితో చర్చించారు. ఇదిలా ఉంటే రోజంతా బాబు ఢిల్లీలో ఉన్నా ఏపీలోని పార్టీ సీనియర్లతో ఫోన్ ద్వారా కాన్ఫరెన్స్ పెడుతూ బిజీగా అయ్యారు.అలాగే టికెట్లు తొలి విడతలో ప్రకటించిన అభ్యర్ధుల ప్రచారం గురించి కూడా ఆరా తీశారు.
ఏపీలో రాజకీయ పరిస్థితుల మీద కూడా ఆయన సీనియర్ల నుంచి వాకబు చేశారు. ఇక శుక్రవారం రాత్రి మరో విడత అమిత్ షాతో భేటీ అయి పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి తేవాలని బాబు పవన్ భావించినప్పటికీ అమిత్ షా బిజీ వల్ల వీలు కాలేదు.
మరో వైపు చూస్తే అమిత్ షా శనివారం పాట్నా వెళ్తున్నారు. ఈలోగానే బాబు పవన్ కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ పొత్తులలో బీజేపీకి ఎన్ని ఎంపీ సీట్లు టీడీపీ ఇస్తుంది అన్న దానిని బట్టి పొత్తు ఫైనలైజ్ అయ్యే చాన్స్ ఉంది అంటున్నారు. టీడీపీ అనుకున్నట్లుగా స్పందించకపోతే బీజేపీ పునరాలోచన చేసే వీలుందని కూడా టాక్ నడుస్తోంది.
మరో వైపు చూస్తే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ నాయకుల పిలుపు మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని చెప్పారు. ఏపీలో టీడీపీ కచ్చితంగా గెలుస్తుందని, ఆ విషయంలో రెండవ మాటకు తావు లేదని, అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కదా అని ఆ పార్టీని కూడా కలుపుకుంటే మంచిది అన్న దాంతోనే పొత్తులకు వెళ్తున్నామని అచ్చెన్న అంటున్నారు. మొత్తానికి ఢిల్లీలో బాబు మూడు రోజులు విడిది చేయాల్సి వస్తోంది. పొత్తులు కొలిక్కి రాకపోతే విలువైన సమయం కూడా వేస్ట్ అవుతోంది అన్న బాధ కూడా పార్టీలో ఉంది అంటున్నారు.