జగన్ పాలనపై శ్వేతపత్రాలు.. చంద్రబాబు ప్లాన్ ఏంటి?
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అనేక పథకాలకు సంబంధించిన హామీలు గుప్పించారు.
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా ఆయన జగన్ పాలనలో రాష్ట్రమౌలిక వనరులే కాకుండా.. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాలనలో జరిగిన విధ్వంసానికి సంబంధించి త్వరలోనే శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అదికూడా శాఖల వారీగా.. జరిగిన నష్టాలు.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి వంటివాటిని చంద్రబాబు విడుదల చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని బుధవారమే తన మంత్రి వర్గ బృందానికి చంద్రబాబు వివరించారు.
ఇప్పుడే ఎందుకు?
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అనేక పథకాలకు సంబంధించిన హామీలు గుప్పించారు. సహజంగానే ఆయనపై ఉన్న విశ్వసనీయతతో ప్రజలు వాటి కోసం ఎదురు చూస్తారు. అయితే.. చంద్రబాబు ప్రకటించిన అన్ని పథకాలకు కూడా భారీ ఎత్తున నిధుల అవసరం ఉంది. దీనిని సర్దుబాటు చేయడం అంటే.. ఇప్పుడు అయ్యే పనికాదు. సహజంగానే కొన్నికొన్ని పథకాలకు మూడు నుంచిఆరుమాసాల వరకు గడువు పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల మద్య విపక్షం చిచ్చుపెట్టుకుండా కూడా చంద్రబాబు చూసుకోవాలి. దీంతో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలను వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీనిలో భాగంగానే చంద్రబాబు ఆయా శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేయడం ద్వారా జగన్ హయాంలో రాష్ట్రం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది? ఎలా ఆర్థికంగా చితికిపోయింది? ఏ విధంగా ఆదాయం కోల్పోయింది? అనే కీలక విషయాలను ప్రజల ముందు కు తీసుకురాను న్నారు. తద్వారా.. తాను అమలు చేయాలని భావిస్తున్న కొన్ని కీలక పథకాలు.. ప్రతి ఇంటికీ అమ్మ ఒడిని ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తామని, ప్రతి 18 ఏళ్లు నిండిన మహిళకు రూ.1500 నెలనెలా ఇస్తామన్న వాగ్దాలను, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటివాటిని కూడా కొంత మేరకు వాయిదా వేసుకునే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.
వీటిని ఆపరు!
అయితే.. తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు హామీల్లో కీలకమైన పింఛనును రూ.3000 నుంచి రూ.4000లకు పెంచడం, మెగా డీఎస్సీని వేయడం వంటి హామీలను మాత్రం తక్షణమే అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కూడా ఆయన రద్దు చేయనున్నారు. ఇక, శాఖ ల వారీగా ఆదాయం పెంచే మార్గాలను కూడా చంద్రబాబు తన మంత్రి వర్గానికి సూచించనున్నారు. ఇలా.. మొత్తంగా ప్రధాన సంస్కరణ దిశగా చంద్రబాబు అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది.