యాంటీబయాటిక్స్ తెగ వాడేస్తున్నారా... కేంద్రం ఆదేశాలివే!
దేశ జనాభాలో సుమారు 80 శాతానికి పైగా ప్రజలు చిన్న చిన్న వ్యాధులకే యాంటీ బయోటిక్స్ ను వాడుతున్నారని కథనాలొస్తుంటాయి.
ప్రజలలోనే కాదు, స్వయంగా కొంతమంది వైద్యులలోనూ యాంటీ బయోటిక్స్ వాడకంపై అవగాహన కొరవడడం విచారకరమని.. యాంటీ బయోటిక్స్ ను అవగాహనతో, వివేకవంత రీతిలో వినియోగించాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు స్పందించిన సంగతి తెలిసిందే. దేశ జనాభాలో సుమారు 80 శాతానికి పైగా ప్రజలు చిన్న చిన్న వ్యాధులకే యాంటీ బయోటిక్స్ ను వాడుతున్నారని కథనాలొస్తుంటాయి. ఈ సమయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.
అవును... ప్రమాదకర సూక్ష్మక్రిములపై బ్రహ్మాస్త్రాలుగా పనికొచ్చే యాంటీబయాటిక్స్ మందులను విపరీతంగా వాడటం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని డబ్ల్యూ.హెచ్.ఓ. పలు సందర్భాల్లో వెల్లడించింది. ఇదే సమయంలో... చిన్న చిన్న వైరల్ ఇన్ ఫెక్షన్లకు సైతం యాంటీ బయోటిక్స్ ను వాడటం వల్ల భవిష్యత్తులో హానికర సూక్ష్మక్రిములు బలం పెంచుకొని మొండిఘటాల్లా తయారవుతాయని చెబుతుంటారు.
ఈ సమయంలో యాంటీ బయాటిక్స్ అధిక వాడకాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా... రోగులకు యాంటీ బయాటిక్స్ వాడకాన్ని సూచించేటప్పుడు తప్పనిసరిగా వైద్యులు కారణాన్ని పేర్కొనాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇదే సమయంలో యాంటీ బయాటిక్స్ వాడకానికి గల కారణంతో పాటు సూచనలు తప్పనిసరిగా తెలియజేయాలని వైద్యుల్ని కోరింది.
తాజాగా... డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ ఈ మేరకు తాజాగా రాసిన లేఖలో వైద్య కళాశాలల వైద్యులందరికీ విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా... యాంటిమైక్రోబయాల్స్ సూచించేటప్పుడు ఖచ్చితమైన సూచన, కారణం, జస్టిఫికేషన్ ను తప్పనిసరిగా పేర్కొనాలని తెలిపారు! ఇదే సమయంలో... ఫార్మసిస్ట్ లకు కూడా చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లపై మాత్రమే వాటిని విక్రయించాలని సూచించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి 2019లో 1.27 మిలియన్ల ప్రపంచ మరణాలకు బాక్టీరియా యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏ.ఎం.ఆర్.) ప్రత్యక్షంగా కారణమని అంచనా వేయబడగా... సుమారు 4.95 మిలియన్ల మరణాలు డ్రగ్ రెసిస్టెంట్ ఇన్‌ఫెక్షన్ లతో ముడిపడి ఉన్నాయని, ఇది ఆధునిక వైద్య ఫలితాలను ప్రమాదంలో పడేస్తుందని అంటున్నారు. ఈ వాడకం ఇలానే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 2050 చివరి నాటికి కోటి మంది మరణాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా... ఏటా నవంబర్ నెల మూడవ వారంలో "ప్రపంచ యాంటీ బయోటిక్ అవగాహనా వారోత్సవాలు" జరుపుతుంటారు. ఈ సందర్భంగా ప్రజలతోపాటు వైద్యులలోనూ వీటి వినియోగంపై అవగాహన కలిగించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది.