అప్పు ఇస్తే పదేళ్ల జైలు, రూ.కోటి జరిమానా కేంద్రం కొత్త చట్టం

అప్పు చేయడం తప్పు కావొచ్చు. కానీ, ఇప్పుడు అప్పులివ్వడమూ నేరం కిందే చూస్తారు. అప్పులిచ్చినందుకు గాను కనీసం పదేళ్ల జైలు శిక్ష పడేలా కేంద్రం కొత్త చట్టం తీసుకువస్తోంది.

Update: 2024-12-22 08:12 GMT

అప్పు చేయడం తప్పు కావొచ్చు. కానీ, ఇప్పుడు అప్పులివ్వడమూ నేరం కిందే చూస్తారు. అప్పులిచ్చినందుకు గాను కనీసం పదేళ్ల జైలు శిక్ష పడేలా కేంద్రం కొత్త చట్టం తీసుకువస్తోంది. ఆన్ లైన్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులను అరికట్టేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

కొద్ది సంవత్సరాలుగా అనుమతిలేని ఆన్ లైన్ యాప్స్ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఆన్ లైన్లో చిన్నచిన్న మొత్తాలు అప్పుగా ఇచ్చి అధిక వడ్డీకింద వంద రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా చెల్లించలేకపోతే ఫోన్లో ఉండే కాంటాక్స్, ఇమేజెస్ తీసుకుని అసభ్య సందేశాలు పంపడం, ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధించడం ఎక్కువైంది. ఈ ఆన్ లైన్ రుణదాతల దుష్ప్రవర్తనకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో ఒక నవ వరుడు తన భార్య ఫొటోను మార్ఫింగ్ చేయడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఇటీవల ఎక్కువైపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ దారుణాలను ఆపేందుకు పకడ్బందీ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకొస్తున్న ఈ సరికొత్త చట్టం ద్వారా అనుమతి లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో రుణాలివ్వడం నేరంగా పరిగణిస్తారు. ఇలా రుణాలిచ్చేవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.కోటి జరిమానా విధించేలా కొత్త బిల్లును ప్రతిపాదిస్తున్నారు.

అనియంత్రిత రుణ కార్యకలాపాలను నిషేధించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆర్బీఐ 2021లోనే ప్రతిపాదించింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ చట్టం చాలా అవసరమని అప్పట్లోనే అభిప్రాయపడింది. ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ అధికారం ఉన్న సంస్థల అనుమతితోనే ఫైనాన్స్ వ్యాపారం చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. నియంత్రిత రుణాలకు సంబంధించిన ఏ చట్టం పరిధిలోకి రాని భౌతిక, డిజిటల్ లేదా ఇతర మార్గాల్లో నిర్వహించే రుణ కార్యకలాపాలను (బంధువులకిచ్చే రుణాలు మినహా) అనియంత్రిత రుణ వ్యాపారంగా గుర్తించాలని బిల్లులో ప్రతిపాదించారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండా రుణాలిచ్చే వారికి కనీసం రెండేళ్ల నుంచి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. రెండు లక్షల నుంచి రూ.కోటి వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అదేవిధంగా రుణ గ్రహీతలను వేధించడం, అనైతిక పద్ధతుల్లో బకాయిల రికవరీకి ప్రయత్నిస్తే మూడేళ్ల నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించాలని భావిస్తోంది.

ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే ఆన్ లైన్ రుణ యాప్స్ కు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్లో చాలా యాప్స్ రుణాలిచ్చేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. ఇలాంటి వాటిని గుర్తించి తొలగించాలని కేంద్రం గతంలోనే ఆదేశాలిచ్చింది. దీంతో 2022 -23 మధ్య సుమారు 2,200 మోసపూరిత యాప్స్ ను గూగుల్ డిలీట్ చేసింది. ఇంకా కొందరు మోసపూరిత పేర్లతో రుణాలిస్తామని అమాయకులను వంచిస్తున్నారు. దీంతో ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చట్టం తేవాలని నిర్ణయింది. ఈ చట్టం అమలులోకి వస్తే గ్రామాల్లో అధిక వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారులకు ముకుతాడు వేయొచ్చని అంటున్నారు.

Tags:    

Similar News