కేంద్రానికి వంద ఇస్తే 46 రూపాయలే ఏపీకి వస్తోంది...!
కేంద్రం అంటే మిధ్య అని స్వర్గీయ ఎన్టీయార్ అన్నారు. ఆయన దృష్టిలో రాష్ట్రాలు నిజమైనవి
కేంద్రం అంటే మిధ్య అని స్వర్గీయ ఎన్టీయార్ అన్నారు. ఆయన దృష్టిలో రాష్ట్రాలు నిజమైనవి. అంటే వాటికి ప్రాదేశికాలు ఉంటాయి. కేంద్రానికి మాత్రం భౌగోళికంగా ఏమీ ఉండదు అన్న భావన ఎన్టీయార్ అప్పట్లోనే వ్యక్తం చేసేవారు. రాష్ట్రాల సమాఖ్య కేంద్రం అన్నదిఎన్టీయార్ ఆలోచన.
రాష్ట్రాలు అన్నీ కలిస్తేనే కేంద్రం అన్నది కూడా చాలా మంది మేధావుల భావన. ఇక సర్కారియా కమిషన్ అన్నది ఎన్టీయార్ లాంటి వారు కేంద్రం మీద పోరాడుతూ రాష్ట్రాల హక్కుల కోసం డిమాండ్ చేసిన సందర్భంలో ఏర్పాటు అయినది. ఇదిలా ఉంటే వివిధ పనుల ద్వారా కేంద్రానికి ఎంతో డబ్బు వెళ్తుంది. అది ఒక్కో రాష్ట్రం ఒక్కోలా కేంద్రానికి అందిస్తుంది.
రాష్ట్రాలు ప్రగతిబాటన పడితే అక్కడ ఎక్కువగా పన్నుల రూపంలో వస్తుంది. అలా వచ్చిన మొత్తంలో తిరిగి రాష్ట్రాలకు కేంద్రం చెల్లిస్తుంది. అయితే ఎంత తిరిగి చెల్లిస్తుంది అంటే అది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతీ వంద రూపాయలకు 88.30 రూపాయలు వంతున రాష్టాలకు వస్తున్నాయి. అయితే అది అన్ని రాష్ట్రాలకు సమానంగా వస్తోందా అన్నదే ఇక్కడ చూడాల్సిన విషయం.
కేంద్రం నుంచి మహారాష్ట్రకు 7.7 రూపాయలు లెక్కన వస్తూంటే ఈశాన్య రాష్ట్రాలు అయిన అరుణాచల్ ప్రదేశ్ కి 4863 రూపాయలు, మిజోరాం కి 3583 రూపాయలు, మణిపూర్ కి 1484 రూపాయలు, నాగాలాండ్ కి 1252 రూపాయలు, త్రిపురకు 1977 రూపాయలు వంతున వస్తున్నాయి. అదే తెలుగు రాష్ట్రాలను చూసుకుంటే తెలంగాణాకు 49.3 రూపాయలు, ఏపీకి 46 రూపాయలు కేంద్రం తిరిగి చెల్లిస్తోంది.
అయితే కేంద్రానికి రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వెళ్తున్నాయని, తిరిగి వాటికి రాష్ట్రాలకు ఇవ్వడంతో వివక్ష ఎందుకు అన్న ప్రశ్నలు తరచూ రాష్ట్రాల నుంచి వస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ నేతలు ఇదే ప్రశ్నను సంధించేవారు. మా డబ్బును మాకు ఇవ్వడం కూడా గొప్పేనా అని ఎద్దేవా చేశారు. మా డబ్బు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా పంచుతున్నారని విమర్శించేవారు.
ఇక కేంద్రం కూడా తన బాధ్యతల నుంచి కొంత తప్పుకుని ఉమ్మడి జాబితాలో ఉన్న వాటిని రాష్ట్రాల పరం కొన్ని అయినా చేస్తే బాగుంటుంది అన్న వాదన ఉంది. కేంద్రం దేశీయ భద్రత విదేశీయ భద్రత, రక్షణ ఆర్ధిక వంటి కొన్ని కీలక శాఖలను ఉంచుకుంటే రాష్ట్రాలు బలోపేతం అవుతాయన్న వాదన కూడా ఉంది.