పోలవరానికి శాపంగా మారిన అసలు కారణం ఇదే... కేంద్రం వెల్లడి!

ఈ నేపథ్యంలో తాజాగా పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం స్పందించింది. దీనికి సంబంధించిన పలు వివరాలు, పలు సమస్యలను లిఖితపూర్వకంగా వెల్లడించింది.

Update: 2024-07-26 04:57 GMT

ఏపీలో ప్రభుత్వాలు మారుతుంటాయి.. తేదీలు మారుతుంటాయి.. అంచనాలు మారుతుంటాయి.. కాంట్రాక్ట్ కంపెనీలు మారుతుంటాయి.. కానీ ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ తలరాత మాత్రం మారడం లేదు! ఈ నేపథ్యంలో తాజాగా పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం స్పందించింది. దీనికి సంబంధించిన పలు వివరాలు, పలు సమస్యలను లిఖితపూర్వకంగా వెల్లడించింది.

అవును... ఏపీ ప్రజల జీవనాడిగా గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూ పాలకులు ఊరిస్తున్న నేపథ్యంలో... తాజాగా గత మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సాగిన తీరుపై టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, జీఎం హరీష్ బాలయోగి.. లోక్ సభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఇందులో భాగంగా... ప్రస్తుతం ఉన్న తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని సీఆర్ పాటిల్ ప్రకటించారు. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకూ నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఇదే సమయంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యానికి గల కారణాలనూ వివరించారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల జాప్యానికి కారణాలను గుర్తించే బాధ్యతను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2021 ఆగస్టులో హైదరాబాద్ ఐఐటీకి అప్పగించినట్లు చెప్పారు. ఈ మేరకు కాంట్రాక్టర్ మార్పుతో పాటు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు నిదానంగా సాగడం, కోవిడ్ సంబంధ అంశాలే కారణమని ఐఐటీ హైదరాబాద్ 2021నవంబర్ లో ఇచ్చిన నివేదికలో పేర్కొందని తెలిపారు.

ఇక 2021-22 నుంచి 2023-24 మధ్య మూడేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం దీనికోసం రూ.8,044.31 కోట్లు అందించినట్లు తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రాజెక్ట్ మిగిలిన పనుల నిర్మాణ వ్యయాన్ని 100% కేంద్రమే సమకూర్చనున్నట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో... 2014-19 తరహాలో అన్నట్లుగా.. కేంద్ర ప్రభుత్వం తరుపున నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని తెలిపారు.

Tags:    

Similar News