మాకు వైసీపీ నేతలకు తేడా అదే : చంద్రబాబు
విశ్వసనీయతకు ప్రాణమిస్తా.. నాకు వైసీపీ నేతలకు ఉన్న తేడా ఇదేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అరెస్టు చేయాలంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనిచేసేవాడిని.. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రూ. కోట్లలో లంచాలు తీసుకున్నారని ఆరోపణలపైనా క్షణాల్లో చర్యలు తీసుకోవచ్చు. కానీ, నేను రాజకీయ కక్ష సాధింపులకు వ్యతిరేకం. విశ్వసనీయతకు ప్రాణమిస్తా.. నాకు వైసీపీ నేతలకు ఉన్న తేడా ఇదేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు.
మంగళగిరిలో పలు విషయాలపై విలేకర్లతో పిచ్చాపటిగా మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వ పాలనా వ్యవహారాలు, విపక్షం తీరు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు వంటి అనేక విషయాలపై సూటిగా స్పష్టంగా మాట్లాడారు. వైసీపీ హయాంలో కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపణలు రావడం తనకు బంగారు లడ్డూలాంటి అవకాశమని సీఎం చెప్పారు. సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా? అని విలేకర్ల ప్రశ్నకు స్పందిస్తూ ఒప్పందం రద్దు చేసుకుంటే జరిమానా కట్టాలి. ఈ దశలో చర్యలు తీసుకోలేం. జగన్ ప్రభుత్వం భూ వివాదాల తేనెతుట్టెను కదిపింది. వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నామని సీఎం తెలిపారు.
భూ సర్వేలో జరిగిన పొరపాట్లను తప్పులను సరిదిద్దాల్సివుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భూమి సమస్యలను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తామని తెలిపారు. విశాఖ జిల్లా సింహాచలం పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
తన ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా సీఎం స్పందించారు. కేంద్ర మంత్రి, అసెంబ్లీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎస్, డీజీపీ ఇలా రాష్ట్రంలో కీలక పోస్టుల్లో ఉన్నవారంతా బీసీ వర్గం వారని సీఎం గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఒక సామాజిక వర్గం వారికే కీలక పోస్టులు కట్టబెట్టిందని తెలిపారు. ఒక్క బీసీలనే కాదు సమాజాంలోని అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యమిచ్చేలా ‘సోషల్ ఇంజనీరింగ్’కి తమ ప్రభుత్వం కట్టుబడిందని సీఎం తెలిపారు. గీత కార్మికులకు 340 మద్యం షాపులు కేటాయించామన, ఎస్పీ వర్గీకరణ చేసిందీ తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు వివరించారు.
పార్టీ కోసం కష్టపడిన వారందరికీ నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో సముచిత ప్రాధాన్యమిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సాగునీటి సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థలు, సహకార సంఘాలు, ట్రస్టుబోర్డుల పదవులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చైర్మన్ పోస్టు కావాలంటే ఇవ్వగలమా? ఈ సారి ప్రతి ఒక్కరికీ రేటింగ్ ఇచ్చి పనితీరు ఆధారంగా పదవులు ఇస్తామని చెప్పారు.