అమరావతి రాజధాని... ఎవరూ కదల్చకుండా బాబు మాస్టర్ ప్లాన్
ఏపీకి రాజధాని ఏది అంటే ఏమో అనేలా ఉండేది గత అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో పరిస్థితి.
ఏపీకి రాజధాని ఏది అంటే ఏమో అనేలా ఉండేది గత అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో పరిస్థితి. ఇలా ఎందుకు అంటే మూడు రాజధానులు అంటూ నాడు వైసీపీ ప్రభుత్వం చేసిన రాజకీయ విన్యాసం ఆ రేంజిలో ఉంది మరి అంటారు. ఆఖరికి రాజధాని ఏపీకి ఉందా లేదా అన్నది కూడా అర్థం కాకుండా పోయింది. అదొక జోక్ గా కూడా అంతా చెప్పుకునే విషాదంగా మారింది.
నిజానికి ఎంతో చరిత్ర కలిగిన ఏపీకి రాజధాని లేకపోవడం దాని మీద కామెంట్స్ అన్నీ అయిదు కోట్ల ఏపీ జనాలను విపరీతంగా బాధించాయి. ఇది విభజన కంటే కూడా అతి పెద్ద గాయంగా మనసులను కలచివేసింది. అందుకే 2024లో వైసీపీకి దిమ్మదిరిగేలా తీర్పు ఇచ్చారు. కూటమికి చరిత్రలో నిలిచిపోయేలా 164 సీట్లను కట్టబెట్టి ఏలుకోమని భారీ చాన్స్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే 2014లో విభజన ఏపీలో తొలిసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చాలా దూరదృష్టిలో అమరావతి రాజధాని నిర్మాణానికి తలపెట్టారు. ప్రపంచ రాజధానిగా చేయాలని అనుకున్నారు. గొప్ప గొప్ప డిజైన్లు వేయించారు. నవ నగరాల నిర్మాణం అని కూడా ప్రతిపాదించారు.
పేరెన్నిక గన్న ప్రఖ్యాత సంస్థలను అమరావతి రాజధానికి రప్పించి పెట్టుబడులు పెట్టించారు. వారికి భూ కేటాయింపులు చేశారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగే ఈ పాటికి అమరావతి ఒక రూపునకూ షేపునకూ వచ్చేది అని అంటున్నారు.
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని కదపాలని చూసింది అన్న విమర్శలు ఎదుర్కొంది. అమరావతిని ఏమీ చేయడం లేదు అది శాసన రాజధానిగా ఉంటుందని వైసీపీ చెప్పినా అక్కడ తట్టెడు మట్టి వేసి ఏదైనా అభివృద్ధి పని తలపెట్టకపోవడంతో పాటు విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ ప్రచారం చేయడం తో కధ రివర్స్ అయింది.
పోనీ విశాఖలో ఎజ్గిక్యూటివ్ క్యాపిటల్ అయినా చేశారా అంటే అదీ లేదు. కర్నూల్ కి హై కోర్టు అన్నారు కానీ అక్కడ కూడా ఏమీ జరగలేదు. ఇలా మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో వైసీపీ రాజకీయం చేసిందని ప్రత్యర్ధి పార్టీలు చేసిన ప్రచారమే జనాగ్రహానికి కారణం కూడా అయింది. మొత్తానికి వైసీపీని ఘోరంగా మూడు ప్రాంతాలలోనూ ఓడించేశారు.
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన తొలి ప్రాధాన్యత అమరావతి మీదనే ఉంచింది. అమరావతిలో గత అయిదేళ్ళలో అభివృద్ధి కానరాక అడవి మాదిరిగా అంతా తయారైంది. దాంతో జంగిల్ క్లియరెన్స్ కి అంతా సిద్ధం చేసింది. ఆ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.
మరో వైపు చూస్తే కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడవసారి అధికారంలోకి రావడంలో కీలకమైన పాత్ర పోషించిన టీడీపీ తన పలుకుబడిని ఈ విధంగా వాడుకుని అమరావతికి ప్రపంచ బ్యాంక్ నుంచి 15 వేల కోట్ల నిధులను మంజూరు చేయించుకుంది. మరో వైపు వివిధ ఏజెన్సీల ద్వారా ఇంకో 12 వేల కోట్ల రూపాయలను కూడా నిధులను సేకరిస్తోంది.
దాదాపుగా ముప్పయి వేల కోట్ల రూపాయల నిధులతో అమరావతి రాజధానిని 2027 నాటికల్లా ఒక షేప్ కు తీసుకురావాలని టీడీపీ కూటమి తలపోస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే అమరావతి రాజధాని అని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇప్పటిరాకా రిలీజ్ చేయలేదు. దాని మీద విశాఖకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ఇక కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో అప్రమత్తంగానే ఉంది. అమరావతి ఏపీకి రాజధని అని గెజిట్ నోటిఫికేషన్ తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కూడా ఉన్నందువల్ల బీజేపీ చెవిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం వేశారు అని అంటున్నారు. దానికి కేంద్ర పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు అని అంటున్నారు.
డిసెంబర్ నెలాఖరులోగా అమరావతి ఏపీకి రాజధాని అని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అదే కనుక జరిగితే అమరావతికి అదే అతి పెద్ద రాజముద్ర గా ఉంటుంది అని అంటున్నారు. అమరావతి రాజధానిని ఇక మీద ఎవరు అధికారంలోకి వచ్చినా కదిపేందుకు వీలు ఉండదని అంటున్నారు.
ఆ విధంగా గట్టి బిగింపులతోనే కూటమి ప్రభుత్వం అమరావతిని ఏపీకి శాశ్వత రజాధానిగా చేయబోతోంది. దాని వల్ల పెట్టుబడులు పెట్టే వారికి పరిశ్రమలు స్థాపించేవారికి కూడా పూర్తి స్థాయిలో నమ్మకం వస్తుందని అంటున్నారు. ఒక్క గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చాలు అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నినాదం అయిన మూడు రాజధానుల ముచ్చట చరిత్రలోనే కలసిపోతుంది అని అంటున్నారు అమరావతి ఏపీకి ఎప్పటికీ శాశ్వత రాజధానిగా ఉండబోతోంది అని అంటున్నారు. దాంతో ఎవరికీ ఏ డౌట్లొ లేకుండా కేంద్రం రాజముద్ర వేయనుంది అని అంటున్నారు.