బిగ్ బ్రేకింగ్... చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూత!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొదరుడు నారా రామ్మూర్తినాయుడు అనారోగ్యం కారణంగా సుమారు వారం రోజులుగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొదరుడు నారా రామ్మూర్తినాయుడు అనారోగ్యం కారణంగా సుమారు వారం రోజులుగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే... శనివారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం, కార్డియక్ అరెస్ట్ తో ఆయన తుదిశ్వాస విడిచారు!
అవును... సినీ హీరో నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకెళ్తారని తెలుస్తోంది. ఆదివారం నారావారి పల్లెలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
కాగా... రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి శనివారం ఉదయం మరింత క్షీణించిందని తెలియడంతో అన్ని కార్యక్రమాలనూ రద్దు చేసుకున్న మంత్రి నారా లోకేష్.. హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. కొద్ది సేపటి క్రితమే ఆయన ఏఐజీ హాస్పటల్ కు చేరుకున్నారు.
ఇదే సమయంలో... ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు.. హైదరాబాద్ కు చేరుకోనున్నారు! ఇవాళ న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో జరిగే మీడియా కాన్ క్లేవ్ లో బాబు పాల్గొనాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లాలనేది షెడ్యూల్ అని అంటున్నారు.
ఈ క్రమంలో.... రామ్మూర్తినాయుడిని కడసారి చూసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, నారా రోహిత్ అభిమానులు ఏఐజీ ఆస్పత్రి వైపు కదులుతున్నారని తెలుస్తోంది.
మరోపక్క తండ్రిని కోల్పోయిన, హీరో నారా రోహిత్ ను ఓదార్చడానికి సినీ ప్రముఖులు, అభిమానులు ఆన్ లైన్ వేదికగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మరికొంతమంది నారా వారి పల్లెకు వెళ్లనున్నారు!
కాగా... 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రామ్మూర్తినాయుడు. ఈ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 16,352 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.