అర్థరాత్రి వేళ చంద్రబాబు చేసిన పనితో అవాక్కు
దేశంలో చాలామంది అధినేతలు ఉన్నప్పటికీ.. వారందరికి భిన్నంగా కనిపిస్తారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
దేశంలో చాలామంది అధినేతలు ఉన్నప్పటికీ.. వారందరికి భిన్నంగా కనిపిస్తారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయనకున్న పట్టుదల అంతా ఇంతా కాదన్న విషయం ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేస్తాయి. పని రాక్షసుడిగా పేరున్న ఆయన.. ఉదయం నుంచి నాన్ స్టాప్ గా పని చేసి అర్థరాత్రి 12 గంటల తర్వాత కూడా అంతే ఉత్సాహంగా కష్టపడే తీరు చూస్తే.. ఇలాంటివి ఆయనకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. 74 ఏళ్ల వయసులో అలసట అన్నది పక్కన పెట్టేసి.. భారీ వర్షాలతో అతలాతకుతలమైన విజయవాడలో మునిగిన ప్రాంతాలకు వెళ్లేందుకు ఆయన చేసిన సాహసం ఒక ఎత్తు అయితే.. అలా బోటులో వెళ్లి వచ్చిన ఆయన.. అధికారులకు సహాయక చర్యలకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.
అక్కడితో ఆగిపోకుండా ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత మరోసారి ఆయన సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయన్న విషయంతో పాటు.. కష్టంలో ఉన్న ప్రజలను ఓదార్చేందుకు.. వారికి వీలైనంత సహాయ సహకారాలు అందించేందుకు పడిన కష్టం.. శ్రమను చూస్తే.. ఇలాంటివి చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు. భద్రతా అధికారులు వద్దని వారించినా పట్టించుకోకుండా విజయవాడలోని సింగ్ నగర్ కు వెళ్లిన చంద్రబాబు.. ఆదివారం అర్థరాత్రి తర్వాత మరోసారి అక్కడకు వెళ్లారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. వెలుతురు లేని వేళలో సెల్ ఫోన్ లైట్ల వెలుతురును అసరాగా చేసుకొని నీళ్లలో మునిగిన ఇళ్ల వద్దకు వెళ్లి.. అక్కడి ప్రజల్ని పరామర్శించారు.
బాధిత కుటుంబాలతో మాట్లాడి.. వారు చెప్పిన సమస్యల్ని తానే స్వయంగా కాగితం మీద రాసుకోవటం గమనార్హం. ఈ సందర్భంగా తన ముందు వచ్చిన పలు ఫిర్యాదులకు ఓపిగ్గా సమాధానం ఇచ్చి.. బాధితులను ఊరడించే ప్రయత్నం చేశారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా సహాయక చర్యలకు తలెత్తిన సాంకేతిక ఇబ్బందుల్ని వివరించి.. వారిని ఓదార్చిన వైనం చూస్తే.. ఇంత ఓపిక చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్న భావన కలుగక మానదు.
ప్రజలు చెప్పిన ఇబ్బందులు.. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని విన్న చంద్రబాబు.. తనకు ఈ ఒక్క రాత్రి అవకాశం ఇవ్వాలని.. మరో ఆరేడు గంటల్లో తాను పరిస్థితుల్ని చక్కబరుస్తానని మాట ఇచ్చారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామంటూ హామీ ఇచ్చారు. త్వరగానే సాధారణ స్థితికి వస్తుందని.. ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్నారు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతోనే తాను అర్థరాత్రి వేళ సింగ్ నగర్ కు వచ్చినట్లుగా చెప్పారు.
కొందరు రోగులు.. పెద్ద వయస్కులు ముంపులో చిక్కుకొని ఉన్నారని.. అందరిని రక్షిస్తామన్న చంద్రబాబు.. సోమవారం ఉదయానికి బోట్లు.. హెలికాఫ్టర్ అందుబాటులోకి వస్తాయని చెప్పి.. అందరిలోనూ కొత్త ఆశలు రేకెత్తించిన తర్వాత ఆలస్యంగా తన బస వద్దకు బయలుదేరారు. మొత్తంగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు చంద్రబాబు ప్రజలతోనే ఉండటం.. అధికారులకు ఆదేశాలుజారీ చేయటంతోనే గడిపి.. ఆ తర్వాత కాస్తంత విశ్రాంతి తీసుకోవటం కోసం తాను బస చేసిన బస్సులోకి వెళ్లారు.