టాలీవుడ్‌పై చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్: సంక్రాంతికి ఏపీ సానుకూలమే?!
ముందస్తు షోలకు అనుమతి ఇచ్చేది లేదని.. టికెట్ ధరలను కూడా పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ వ్యవహారం.. హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల పుష్ప-2 ప్రీమియర్ షో విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో చోటు చేసుకున్న రచ్చ అనంతర పరిణామాలు.. కాక రేపుతున్నాయి. ముందస్తు షోలకు అనుమతి ఇచ్చేది లేదని.. టికెట్ ధరలను కూడా పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తాను ఆ సీటులో ఉన్నంత వరకు కూడా.. టికెట్ల ధరలు పెరగబోవన్నారు. ఈ పరిణామాలు టాలీవుడ్‌ను దిగ్భ్రాంతిలోకి నెట్టాయి. పైకి ఇది చిన్న సమస్యే అని పైకి చెబుతున్నా.. వచ్చే సంక్రాంతి సీజన్‌ను చూసుకుంటే మాత్రం ఇది టాలీవుడ్‌కు పెద్ద సమస్యే.
అయితే.. అందరూ మౌనంగానే ఉన్నారు. ఎవరూ పైకి ఏమీ మాట్లాడడం లేదు. ఇదిలావుంటే.. టాలీవుడ్ విషయంలో ఏపీ సంగతేంటి? అనేది ఇటీవల చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పుష్ప-2 రచ్చ జరిగినా.. ఏపీలో ఎలాంటి ప్రకటనలూ రాలేదు. ప్రభుత్వ నేతలు అందరూ మౌనంగా ఉన్నారు. అయితే.. తాజాగా సీఎం చంద్రబాబు టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఇప్పుడు చిత్రపరిశ్రమ జోరుగా ముందుకు సాగుతోందని.. గతంలో టీడీపీ ప్రభుత్వం వేసిన పునాదులు ఇప్పుడు మార్కెట్‌ను కూడా పెంచాయని ఆయన అన్నారు.
అమరావతిలోనూ చిత్ర పరిశ్రమను ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. ప్రపంచ స్థాయిలో చిత్ర పరిశ్రమకు మార్కెట్ వచ్చేలా ఇక్కడి పరిస్థితులు మారుతాయని చెప్పారు. అయితే.. ఇప్పటికిప్పుడు సినీ పరిశ్రమపై తాను ఏమీ చెప్పలేనన్నారు. దీనిని బట్టి.. వచ్చే సంక్రాంతి సమయానికి మాత్రం ఏపీ సర్కారు టాలీవుడ్ విషయంలో సానుకూలంగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోం ది. వెంకటేష్, బాలయ్య, రామ్ చరణ్ సహా పలువురు పెద్ద హీరోల సినిమాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో వారికి అడ్వాన్స్ మూవీ ప్రదర్శనలు, టికెట్ల ధరలు పెంచుకునే సౌలభ్యం ఉండే అవకాశం ఉందని..చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారన్న సంకేతాలు వస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.