జనసేన ప్లీనరీకి పిఠాపురం ఆతిధ్యం
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గా మారిన నేపథ్యంలో తొలిసారి జనసేన అధికారిక హోదాలో తన పదకొండవ ప్లీనరీని జరుపుకుంటోంది.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గా మారిన నేపథ్యంలో తొలిసారి జనసేన అధికారిక హోదాలో తన పదకొండవ ప్లీనరీని జరుపుకుంటోంది. జనసేన 2014 మార్చి 14న హైదరాబాద్ వేదికగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. 2014 లో జనసేన పోటీ చేయలేదు. 2019లో పోటీ చేస్తే ఒక్క సీటు దక్కింది. ఇక 2024 ఎన్నికలు జనసేనకు ఎప్పటికీ మరచిపోలేని తీయని అనుభవాన్ని మిగిలించాయి.
మొత్తానికి మొత్తం 21 సీట్లూ గెలుచుకుని జనసేన కొత్త రికార్డుని స్థాపించింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఆయన అత్యంత కీలకంగా ఉన్నారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో సన్నిహిత మిత్రుడిగా ఉంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేత పవన్ ఒక తుఫాను అని పిలిపించుకున్నారు.
ఇలాంటి ఎన్నో మధురమైన అందమైన సందర్భాలను గడచిన ఏడు నెలల కాలంలో అందుకున్న జనసేన పూర్తి అధికారిక దర్జాతో తన ప్లీనరీని సగర్వంగా నిర్వహిస్తోంది. అయితే ఈ ప్లీనరీకి వేదిక ఎక్కడా అన్న చర్చ కూడా ఉంది. కానీ దానికి సమాధానం అన్నట్లుగా పిఠాపురం ఎదురు నిలిచి స్వాగతం పలుకుతోంది.
జనసేన ప్లీనరీని ఈసారి పిఠాపురంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఏపీలో తమ ప్రభుత్వం ఉండగా నిర్వహిస్తున్న తొలి పార్టీ వేడుకగా దీనిని జనసేన వర్గాలు సంబరంగా చేసుకోనున్నాయి. మార్చి 12 13, 14 తేదీలలో మూడు రోజుల పాటు జనసేన ప్లీనరీని పిఠాపురంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధినాయకత్వం నుంచి ఆదేశాలు నాయకులకు వెళ్లాయి. చక్కగా సజావుగా పిఠాపురంలో ప్లీనరీని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కూడా అధినాయకత్వం దిశా నిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ ప్లీనరీని నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా నిర్వహించాలని కూడా జనసేన నిర్ణయించింది. జనసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు పార్టీ కీలక నేతలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చే లక్షలాది మంది క్యాడర్ తో పిఠాపురం కొత్త రాజకీయ శోభను సంతరించుకోనుంది అని అంటున్నారు.
ఇక వారందరికీ పిఠాపురం మర్యాదలు ఆతీధ్యాలు చాలా ఘనంగా దక్కనున్నాయి అంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని సంబరపడే నియోజకవర్గంలో జనసైనికులు అంతా చాలా ప్రతిష్టాత్మకంగా దీనిని తీసుకుని ఇప్పటి నుందే ఏర్పాట్లలో మునిగిపోతున్నారు. మొత్తానికి జనసైనికులకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే వార్తగా అంతా అంటున్నారు.