ఇప్పుడున్నవి సరిపోవా? ఏపీకి కొత్తగా 7 ఎయిర్ పోర్టులు
వాయు వేగంతో మెట్రో రైలు వ్యవస్థ సిద్ధం కావాలి. రాజధాని అమరావతి రూపుదిద్దుకోవాలి. ఇప్పటికే ఏపీలో బోలెడన్ని ఎయిర్ పోర్టులు ఉన్నాయి.
అవసరానికి తగ్గట్లుగా ఏర్పాట్లు ఎప్పటికైనా బాగుంటుంది. అందుకు భిన్నంగా వరుస పెట్టి ఏర్పాట్లు చేయటం..అవేవీ తగినట్లుగా సిద్దం కాకపోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకు పట్టటం లేదు. ఏపీకి ఇప్పుడు కావాల్సింది కొత్త ఎయిర్ పోర్టుల కంటే కూడా.. వాయు వేగంతో మెట్రో రైలు వ్యవస్థ సిద్ధం కావాలి. రాజధాని అమరావతి రూపుదిద్దుకోవాలి. ఇప్పటికే ఏపీలో బోలెడన్ని ఎయిర్ పోర్టులు ఉన్నాయి.
తిరుపతి పక్కనే ఉండే రేణుగుంట.. కడప.. కర్నూలు.. విజయవాడకు సమీపంలోని గన్నవరం.. రాజమండ్రి.. విశాఖపట్నం ఉన్నాయి. వీటిల్లో కర్నూలుకు ఎప్పుడో ఒక విమానం వచ్చి వెళ్లే పరిస్థితి. పేరుకు ఇన్ని ఎయిర్ పోర్టులు ఉన్నా.. తెలంగాణలోని హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో 20 శాతం రద్దీ కూడా ఏపీలోని అన్ని విమానాశ్రయాలకు కలిపినా ఉండని దుస్థితి.
అలాంటప్పుడు ఎయిర్ ట్రాఫిక్ ను పెంచుకోవటం.. విమానాల సంఖ్యతో పాటు.. అదనపు వసతులు.. విస్తరణ మీద ఫోకస్ చేసుకోవాలే తప్పించి.. అదే పనిగా కొత్త ఎయిర్ పోర్టులతో పెద్దగా ప్రయోజనం ఉండదు.కానీ.. ఆ విషయాల్ని చంద్రబాబు పట్టించుకున్నట్లుగా లేదు. తాజాగా ఏపీలో మరో ఏడు కొత్త ఎయిర్ పోర్టులు రానున్నట్లుగా ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అధికారులతో సమీక్ష జరిపిన ఆయన..ఈ సందర్బంగా ఏపీకి వచ్చే కొత్త ఎయిర్ పోర్టు వివరాల్ని వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్తగా వచ్చే 7 ఎయిర్ పోర్టులు ఎక్కడెక్కడ రానున్నాయంటే..
- కుప్పం
- దగదర్తి
- శ్రీకాకుళం
- తాడేపల్లి గూడం
- నాగార్జునసాగర్
- తుని
- అన్నవరం
- ఒంగోలు
శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఫీజిబిలిటీ సర్వే పూర్తైందని.. రెండు దశల్లో 1383 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తామని.. ఇందుకు అవసరమైన భూమిని సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. దగదర్తిలో ఎయిర్ పోర్టును 1379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు. ?ఇందుకు 635 ఎకరాలు సేకరించారు.మిగిలిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒంగోలు ఎయిర్ పోర్టు నిర్మాణానికి 657 ఎకరాల్ని ప్రభుత్వం గుర్తించిందని.. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ లో 1670 ఎకరాల్లో.. తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల్లో . తుని - అన్నవరం మధ్య ఎయిర్ పోర్టు నిర్మాణానికి 757 ఎకరాలు.. శ్రీసిటీలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నట్లుగా చంద్రబాబుచెప్పారు. కుప్పంలో రెండో దశలోఎయిర్ పోర్టును నిర్మిస్తామన్న చంద్రబాబు.. మొదటి దశలో 683 ఎకరాలు.. రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇక.. గన్నవరం ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి డ్యాన్స్.. అమరావతి స్తూపం థీమ్ తో రూపొందించిన అక్రతులతో నిర్మించేందుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. విమానాశ్రయ విస్తరణ.. కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనుల్ని ఆర్నెల్లలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు దేశంలోని ఉత్తర భాగంలో చలి పంజాతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో పొగమంచు కమ్మేసింది. దీంతో.. విమాన.. రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు విజిబిలిటీ సున్నాకు పడిపోవటంతో.. విమానాశ్రయంలో సేవల్ని తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో దాదాపు 200లకు పైగా విమానాలు ఆలస్యంగానడుస్తున్నాయి. మరో 30 విమానాల్ని రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో పాటు..కోల్ కతా.. చండీగఢ్.. అమ్రత్ సర్.. జైపూర్ తో సహా పలు విమానాశ్రయాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొందని చెబుతున్నారు. పొగ మంచు కారణంగా ఢిల్లీకి వెళ్లే దాదాపు 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనవరి 8 నాటికి దేశ రాజధానిలో మంచుకురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.